ETV Bharat / state

చంచల్‌గూడ జైలు నుంచి నందకుమార్‌ విడుదల

author img

By

Published : Jan 13, 2023, 8:13 AM IST

Updated : Jan 13, 2023, 8:50 AM IST

nanda kumar
నందకుమార్​

08:10 January 13

జైలు నుంచి విడుదలైన నందకుమార్​

Nandakumar released from Chanchalguda Jail: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్​ను గత నెలలో భూవివాదం కేసులో బంజారాహిల్స్​ పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్​లోని చంచల్​గూడ జైలుకు తరలించారు. అయితే నేడు జైలు నుంచి బెయిల్​పై విడుదలయ్యాడు. భూ అక్రమ దందాలు చేస్తూ నందకుమార్​ మధ్యవర్తిగా ఉండేవాడు. అయితే బాధితుల ఫిర్యాదుతో గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది: గత నెలలో ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో నిందితుడిగా ఉన్న కోరె నందకుమార్‌ అలియాస్‌ నందు బెదిరింపులకు పాల్పడ్డాడంటూ వచ్చిన ఫిర్యాదుపై బంజారాహిల్స్‌ పోలీసులు మరో కేసు నమోదు చేసి.. చంచల్​గూడ జైలుకు తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్‌కు చెందిన సిందర్కర్‌ సతీశ్​ (53)కు అతని స్నేహితుడి ద్వారా 2017లో నందకుమార్‌ పరిచయమయ్యాడని పోలీసులు పేర్కొన్నారు.

అప్పట్లో నందకుమార్‌ ఫిలింనగర్‌ రోడ్డు నంబరు 1లో ఫిల్మీ జంక్షన్‌ పేరుతో హోటల్‌ నిర్వహించేవాడని తెలిపారు. అవసరాల కోసం చిన్న చిన్న మొత్తాలను చేబదులుగా తీసుకొని తిరిగి చెల్లించి నమ్మకంగా ఉండేవాడని వెల్లడించారు. ఈ క్రమంలో 2018లో వికారాబాద్‌ జిల్లా దోమ మండలం భోంపల్లి గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలుకు సంబంధించి నందకుమార్‌ మధ్యవర్తిత్వం వహించాడని పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు. భూమిని సతీష్‌కు ఇప్పించి.. ఆ భూమి యజమానికి ఇవ్వాల్సిన మొత్తాన్ని సతీష్‌ చెల్లించాడని వివరించారు.

అనంతరం నందకుమార్‌ ఈ భూవ్యవహారంలో వివాదం సృష్టించాడు. తన పేరుతో భూమి రిజిస్టర్‌ చేయాలని లేదంటే చంపేస్తానని బెదిరించాడని తమకు వచ్చిన ఫిర్యాదులో ఉందని పోలీసులు తెలిపారు. దీంతో సతీష్‌ రూ.21 లక్షలు చెక్కు రూపంలో నందకుమార్‌కు ఇచ్చాడన్నారు. అనంతరం అక్కడ భూముల ధరలు పెరగడంతో నందు మరోసారి బెదిరించగా, రూ.11లక్షలు చెల్లించి, ఇకపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడవద్దని సతీశ్​ కోరాడని వెల్లడించారు. రెండు నెలల క్రితం.. త్వరలోనే తాను బీజేపీ నుంచి ఉపముఖ్యమంత్రి కాబోతున్నానని, మరింత డబ్బు ఇవ్వాలని నందు బెదిరింపులకు దిగినట్లు సతీష్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నందకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. నందకుమార్​ను
అరెస్టు చేసి చంచల్​గూడ జైలుకు తరలించారు. అయితే నేడు నందకుమార్​ బెయిల్​పై విడుదలయ్యాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితులలో ఒకడిగా ఉన్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 13, 2023, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.