ETV Bharat / state

Munugodu By election: మునుగోడు ఉపపోరుకు సిద్ధం.. మూడు పార్టీలకు సవాల్

author img

By

Published : Aug 8, 2022, 9:56 PM IST

Munugodu By election: రాష్ట్రంలో మరో ఉపఎన్నిక ఖాయమైంది. మునుగోడు శాసనసభ్యుడు రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనలతో రాజకీయ వేడిని రగల్చగా తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా ఆమోదంతో ఉపఎన్నికపై సందిగ్ధత వీడింది. ఇక మునుగోడు కదనరంగంలోకి దూకేందుకు రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలన్నింటికి సవాల్‌గా మారిన ఈ ఉపఎన్నిక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

Munugodu By election
Munugodu By election

మునుగోడు ఉపపోరుకు సిద్ధం.. మూడు పార్టీలకు సవాల్

Munugodu By election: అలకలు-బుజ్జగింపులు. షోకాజ్ లు-సవాళ్లు. విమర్శలు-ప్రతివిమర్శల అనంతరం ఎట్టకేలకు రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా అనంతరం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా సభాపతి వెంటనే ఆమోదించటం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ నెల 2న తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపించిన ఆయన తాజాగా అసెంబ్లీలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. స్పీకర్‌ ఫార్మట్‌లో రాజీనామా పత్రాన్ని అందజేయటంతో పరిశీలించిన పోచారం నిమిషాల్లోనే ఆమోదించటంతో ఉపఎన్నిక ఉత్కంఠకు తెరపడినట్లైంది.

అంతకుముందు తన అనుచరులతో కలిసి గన్‌పార్కు వద్దకు చేరుకున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ నేడు ఒక కుటుంబం చేతిలో చిక్కుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసమే తన పోరాటమన్న రాజ్‌గోపాల్‌ రాజకీయాలను మలుపుతిప్పేలా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని దీమా వ్యక్తం చేశారు.

రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం ఉపఎన్నిక అనివార్యంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తుండగా... ఆయన సైతం అదే స్థాయిలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ , తెరాసలకు సవాల్‌గా మారిన ఈ ఉపఎన్నికను ఆయా పార్టీల నేతలు ప్రతిష్మాత్మకంగా తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి ప్రాంతం, సిట్టింగ్ స్థానమైన మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి వెంట క్యాడర్ వెళ్లకుండా ఇప్పటికే ఆ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అటు అధికార తెరాస సైతం ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ.... గెలుపు కోసం అంతర్గతంగా చర్యలు చేపట్టింది. మరోవైపు రాజ్ గోపాల్ రెడ్డి త్వరలో కమలం గూటికి చేరనున్న నేపథ్యంలో గత ఉపఎన్నికల ఊపును కొనసాగించేందుకు భాజపా వ్యూహాలు సిద్ధం చేస్తోంది.


ఇవీ చదవండి: Chikoti Praveen: క్యాసినో వ్యవహారం.. కీలక ఆధారాలు సేకరించిన ఈడీ

యూజీసీ-నెట్ రెండో దశ పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.