ETV Bharat / state

సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తా: కేసీఆర్

author img

By

Published : Nov 7, 2020, 8:28 PM IST

Updated : Nov 7, 2020, 9:10 PM IST

సీఎం కేసీఆర్‌ను సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున కలిశారు. రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి- విస్తరణపై చర్చించారు. హైదరాబాద్‌ శివారులో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని కేసీఆర్​ వెల్లడించారు. సినిమా సిటీ కోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు.

సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తా: కేసీఆర్
సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తా: కేసీఆర్

తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి-విస్తరణపై చర్చ జరిగింది. ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, శేషాద్రి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడారు. ‘తెలంగాణలో దాదాపు 10 లక్షల మంది చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు నడవక అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు పునఃప్రారంభించాలి. థియేటర్లు కూడా ఓపెన్ చేయాలి. అప్పుడే చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే కుటుంబాలు కష్టాల నుంచి బయటపడతాయి’.

‘హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి-విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇది కాస్మో పాలిటన్ సిటీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు, వివిధ భాషలకు చెందిన వారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఇక్కడ షూటింగ్‌లతో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను సౌకర్యవంతంగా నిర్వహించుకునే వీలుంది. ఇప్పుడున్న వాతావరణానికి తోడు ఫిల్మ్‌ సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందు కోసం ప్రభుత్వం 1500-2000 ఎకరాల స్థలాన్ని సేకరించి, ఇస్తుంది. అందులో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు సినిమా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ అనుమతులతో షూటింగ్‌లు ప్రారంభించామని, త్వరలోనే థియేటర్లు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి, నాగార్జున చెప్పారు.

ఇదీ చదవండి: అందుకనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్​

Last Updated :Nov 7, 2020, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.