ETV Bharat / state

అమ్మా.. నీ మనసు వెన్న...

author img

By

Published : May 10, 2020, 6:51 AM IST

తొమ్మిది నెలలు తల్లి కడుపులో చల్లగా ఉన్నాం. నాలుగేళ్లు అమ్మ ఒడిలో హాయిగా పెరిగాం. ఉద్యోగాలు, పెళ్లి, పిల్లలు.. జీవితంలో ఒక్కో ముచ్చటా తీరేకొద్దీ ఎందుకో అమ్మకు దూరమవుతున్నాం. మానసికంగా దగ్గరగా ఉన్నా.. అమ్మను కలవలేకపోతున్నారు కొందరు. ఉండేది ఒకే దగ్గరైనా.. మానసికంగా దూరమవుతున్నారు ఇంకొందరు. లాక్‌డౌన్‌ పుణ్యాన అమ్మకు దగ్గరయ్యే అవకాశం వచ్చిందని ఎందరో సంబరపడుతున్నారు. అమ్మతో మళ్లీ అనుబంధాలు పెనవేసుకుంటున్నారు మాతృదినోత్సవ వేళ.. ఆ ముచ్చట్లే మీతో పంచుకోవడానికి వచ్చారిలా...

mothers day
అమ్మ నీ మనసు వెన్న

అమ్మ లలిత గాంధీ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌. కరోనా డ్యూటీతో కొద్దిరోజులు ఇంటికే రాలేదు. అప్పుడెంత బాధపడ్డానో. ఇప్పుడు రోజూ పండగే. అమ్మ ప్రతిక్షణం నాతోనే గడుపుతోంది. బోలెడు కబుర్లు, కథలు చెబుతోంది. అమ్మమ్మ, తాతయ్యల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తోంది. ఆసుపత్రి డ్యూటీ, ఇంటి పనులు, మాపై ప్రేమ చూపడం, కోరినవి చేసిపెట్టడం.. ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి మా అమ్మ ‘సూపర్‌ మామ్‌’ అనిపిస్తుంది. మొన్నీమధ్య ఒకరోజు బాగా ఒళ్లు నొప్పులని మంచం దిగలేదు. ఆ రోజు అమ్మ దగ్గరే ఉండి నూనె రాసి మర్ధన చేశా. కబుర్లు చెప్పా. ఈమాత్రం దానికే మా అమ్మలా సేవలు చేస్తున్నావని మెచ్చుకుంది. ఇంట్లో, ఆసుపత్రిలో సేవలందించే అమ్మను చూస్తే గొప్పగా అనిపిస్తుంది.

- హర్షిత, విద్యార్థిని

mothers day
అమ్మ నీ మనసు వెన్న

అమ్మ మనల్ని ప్రేమగా పొత్తిళ్లలో పొదువుకొని లాలిస్తుంది. గోరుముద్దలు తినిపిస్తుంది. చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది. కానీ ఆమె ఎన్ని సేవలు చేసిందో, ఎంత ప్రేమ పంచిందో చిన్నతనంలో మనకేం తెలియదు. లాక్‌డౌన్‌ పుణ్యమాని ఆ లాలన, ఆ ఆపేక్ష మళ్లీ చూసే అవకాశం దక్కింది. కాలేజీ వదిలి రెండు నెలల నుంచి ఇంటికే పరిమితమైపోవడంతో అమ్మ అంజలి గొప్పతనం ప్రత్యక్షంగా చూస్తున్నా. పొద్దున్నే టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏదో ఒక వెరైటీ స్నాక్స్‌.. అడిగినవి, అడగనివీ, నాకిష్టమైనవన్నీ చేసి పెడుతూనే ఉంది. ఇతర పనులు సరేసరి. ఇంత చేసినా తన మొహంలో అలుపన్నదే ఉండదు. అన్నింటికన్నా ముఖ్యం అమ్మ మొహంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగనీయదు. ఇంత వయసు వచ్చినా మాకు చంటిపాపల్లా జాగ్రత్తలు చెబుతూనే ఉంటుంది.

- స్వాతి రుద్ర, ఇంటీరియర్‌ డిజైనర్‌ విద్యార్థిని

mothers day
అమ్మ నీ మనసు వెన్న

అమ్మయితేగానీ అమ్మ గొప్పతనం తెలియదేమో! నా చిన్నప్పుడు అమ్మ పార్వతి పదేపదే జాగ్త్రత్తలు చెప్పేది. స్కూల్‌, కాలేజీ నుంచి ఆలస్యంగా వస్తే కంగారుపడేది. చీవాట్లు పెట్టేది. చదవమని ఒత్తిడి చేస్తుంటే ‘అబ్బా.. ఏంటీ గోల’ అనిపించేది. ఇప్పుడు నేనూ అమ్మనయ్యాక.. అప్పుడు అమ్మ నాకోసం ఎంత తపించిపోయేదో అర్థమవుతోంది. ఒక దురదృష్టకర సంఘటన కారణంగా నేను హోం క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నేను వేరే గదిలోనే ఉంటున్నా. అప్పుడే కళ్లు తెరిచిన పసిగుడ్డులా అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది. నన్నే కాదు.. నా పిల్లలు, అన్నయ్య పిల్లల్నీ అమ్మలా సాకుతోంది. ఎంతో ప్రేమ ఉంటేగానీ ఇంతమందికి పనులు చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ చూస్తుంటే నేను ఆమెకు మళ్లీ పుట్టాననిపిస్తోంది.

-స్వాతి, అసిస్టెంట్‌ మేనేజర్‌

mothers day
అమ్మ నీ మనసు వెన్న

ఇదీ చూడండి: కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.