ETV Bharat / state

'మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక యంత్రాలు'

author img

By

Published : May 4, 2020, 9:39 PM IST

హైదరాబాద్​ మాసబ్​ట్యాంక్​ పశుసంవర్థక శాఖ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సరఫరా తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాజేంద్రనగర్​లో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీ ఉపయోగించనున్నట్లు తెలిపారు. రానున్న రెండేళ్లలో విజయ ఉత్పత్తులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

minister talasani srinivas yadav milk production in vijaya diary
'మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీ ఉపయోగిస్తాం'

రాజేంద్రనగర్‌లో 240 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీ ఉపయోగించనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. అత్యాధునిక మెషినరీ కోసం ఇతర రాష్ట్రాల్లో అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్ మాసబ్​ట్యాంక్ పశుసంవర్ధక శాఖ సమావేశ మందిరంలో ఆ శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ సంచాలకులు లక్ష్మారెడ్డితో కలిసి లాక్‌డౌన్ నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. కరోనా నేపథ్యంలో పాల సరఫరా, సేకరణలో అధికారులు, సిబ్బంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల నుంచి పాలు తీసుకొచ్చే వాహనాలు, పాలు, పాల ఉత్పత్తులు రవాణా చేసే వాహనాలకు ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

విస్తృత ప్రచారం

పాల ఉత్పత్తుల తయారీ వద్ద తప్పనిసరిగా సిబ్బంది గ్లౌజులు, మాస్కులు ధరించడంతోపాటు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించారు. డెయిరీ పాలి టెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కూడా అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. రానున్న 2 ఏళ్లల్లో విజయ ఉత్పత్తులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ప్రస్తుతం పాడి రైతులకు ఇస్తున్న 4 రూపాయల ప్రోత్సాహం విజయ డెయిరీ చెల్లించే స్థాయికి అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అధికారులను నియమించిన తర్వాత సుమారు 35 వేల లీటర్ల పాల సేకరణ పెరిగిందని అన్నారు. పాల సేకరణ కేంద్రాల వద్ద తప్పని సరిగా పాల నాణ్యత పరిశీలించే ఎనలైజర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పలు జిల్లాల్లో సంచార పార్లర్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వినియోగదారులకు పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు మహబూబ్‌నగర్‌, ఖమ్మం, సంగారెడ్డి, జనగాం, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వరంగల్, మెదక్ జిల్లాల్లో రైతుబజార్లలో సంచార పార్లర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లలో అధికారుల సహకారంతో డోర్‌ డెలివరీ చేస్తున్నామన్నారు. ముందుచూపుతో ప్రణాళికాబద్దంగా వ్యవహరించడం వల్ల వేసవిలో కూడా పశుగ్రాసం కొరత లేకుండా చూడగలిగామని చెప్పారు. పశుసంవర్ధక శాఖలో ఎంతో కాలంగా వెటర్నరీ సర్జన్లుగా సేవలందిస్తున్న తమకు అసిస్టెంట్ సర్జన్లుగా పదోన్నతి కల్పించాలంటూ వెటర్నరీ సర్జన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నందున ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం... పధోన్నతుల ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్​డౌన్​పై మంగళవారం మంత్రివర్గ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.