ETV Bharat / state

రాజగోపాల్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ... కేటీఆర్​ ఫైర్​

author img

By

Published : Mar 14, 2022, 4:18 PM IST

Updated : Mar 14, 2022, 7:58 PM IST

రాజగోపాల్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ
రాజగోపాల్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ మొదలైంది. మంత్రి తలసానిపై చేసిన వ్యాఖ్యలతో శాసనసభలో వాగ్వాదం మొదలైంది. రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

మంత్రిపై రాజగోపాల్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ

సాగు నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. తెరాసకు పేరు రావటం కోసం కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆక్షేపించారు. ప్రాణహిత-చేవేళ్ల, సీతారామ ప్రాజెక్టులను ఉదాహరణగా చెప్పారు.

ఈ క్రమంలో కలుగజేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌... మెుబిలైజ్‌ అడ్వాన్సులతో దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. 70 ఏళ్లలో ఖమ్మం జిల్లాకు చుక్క నీరివ్వలేదన్నారు. మంత్రి వ్యాఖ్యలను భట్టి విక్రమార్క ఖండించారు. రీడిజైన్‌ పేరుతో అంచనా వ్యయం వేలకోట్లకు పెంచారని ఆరోపించారు.

మంత్రిపై రాజగోపాల్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఈ క్రమంలో మంత్రి తలసానిపై అసభ్య పదజాలం ఉపయోగించారని తెరాస సభ్యులు రాజగోపాల్​ రెడ్డిపై మండిపడ్డారు. రాజగోపాల్​రెడ్డిని మంత్రి తలసాని కాంట్రాక్టర్​ అని సంభోదించడతో.. గొడవ మొదలైంది. దీంతో రాజగోపాల్​రెడ్డి తలసానిపై విరుచుకుపడ్డారు. రాజగోపాల్​రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలని తెరాస శాసనసభ్యులందరూ డిమాండ్ చేశారు.

తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ఎమ్మెల్యే

రాజగోపాల్​రెడ్డి మాట్లాడిన మాటాలను రికార్డుల నుంచి తొలగించడం జరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ తెలిపారు. రాజగోపాల్​రెడ్డి అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలని కోరారు. క్షమాపణ చెబితేనే... అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పిస్తామని స్పీకర్ అన్నారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. అయితే తన మాటాలను వెనక్కి తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి సభలో చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప మిగతా చోట్ల రోడ్లు వేయట్లేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో మాత్రం 4 లేన్లు, 6 లేన్ల రోడ్లు వేశారు. తెరాస ఎమ్మెల్యే నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారు. గత నాయకుల పేర్లు ఎక్కడా కనిపించవద్దనే ధోరణి కనిపిస్తోంది. ప్రాణహిత- చేవెళ్ల నిర్మిస్తే గ్రావిటీ ద్వారానే గోదావరి నీరు వచ్చేది. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌ మార్చేసి భారీ ఎత్తిపోతల పథకం నిర్మించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పైగా పెంచారు.

-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే

కాంగ్రెస్‌పై కేటీఆర్‌ నిప్పులు

ఈ క్రమంలో జోక్యం చేసుకున్న మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌పై నిప్పుల వర్షం కురిపించారు. నాలుగు రోజులుగా బడ్జెట్​ పద్దులపై చర్చ జరుగుతుంటే... బాధ్యాతయుతంగా మాట్లాడటం సరికాదన్నారు. ''అసలు వీళ్లది ఏ పార్టీ అండి... ఏ ఫర్​ ఆదర్శ్​, బీ ఫర్ భోఫోర్స్.. సీ ఫర్​ కామన్​వెల్త్.. ఏ నుంచి జెడ్​ దాకా... ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కూరుపోయారు'' అంటూ కేటీఆర్ కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాజగోపాల్​పై ఫైర్​ అయ్యారు.

ఇదీచూడండి: 12-14 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ బుధవారం షురూ


Last Updated :Mar 14, 2022, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.