ETV Bharat / state

Urban development: 'భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. పట్టణాభివృద్ధి ప్రణాళిక'

author img

By

Published : Jul 29, 2021, 7:50 PM IST

Updated : Jul 29, 2021, 7:59 PM IST

Urban development, minister ktr
పట్టణాభివృద్ధి ప్రణాళిక, మంత్రి కేటీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి(Urban development) సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి కేటీఆర్‌(minister ktr) అన్నారు. స్వల్పకాలిక లక్ష్యాలతో కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ శాఖ విభాగాల అధిపతులతో విస్తృతస్థాయి మేథోమధన సమావేశం నిర్వహించారు. వారి నుంచి పలు సూచనలు, సలహాలు సేకరించారు.

పట్ణణాల్లో అభివృద్ధి మరింత ప్రణాళికాబద్ధంగా జరిగేలా.. స్థానిక పరిస్థితులు, ఆయా పట్టణాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని.. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(minister ktr) అధికారులకు స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న పట్టణీకరణ మేరకు పట్టణాభివృద్ధి(Urban development) దిశగా నిరంతరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్ ఆస్కిలో విస్తృతస్థాయి మేథోమధన సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులతో సమావేశంలో చర్చించారు. ఆరు గంటలపాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై మున్సిపల్ శాఖ విభాగాల అధిపతులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

లక్ష్యాలకు అనుగుణంగా

పట్టణాల ప్రణాళిక రూపకల్పన సమయంలో భవిష్యత్తు అవసరాలకు సంబంధించి పెద్దపీట వేయాలని పట్టణాభివృద్ధి నిపుణులు కేటీఆర్‌కు సూచించారు. పట్టణాల అవసరాలు గతంలో కన్నా భిన్నంగా ఉన్నాయని... దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పట్టణాల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందన్న కేటీఆర్... కేవలం స్వల్పకాలిక లక్ష్యాలే కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలతో పట్టణాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ నగరంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనేక మౌలిక వసతుల కార్యక్రమాలు, ప్రాజెక్టులను చేపట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

Urban development, minister ktr
పలు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చిస్తున్న మంత్రి కేటీఆర్‌

ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి

పట్టణ ప్రణాళిక తయారీలో దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన పద్ధతులపైన మహారాష్ట్ర, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులతో మంత్రి చర్చించారు. పట్టణాభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులు, చట్టాలను అధ్యయనం చేసేందుకు పురపాలక శాఖ ఉన్నతాధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు. ఇలాంటి విస్తృతమైన మేథోమధన సమావేశాలతో అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వివిధ అంశాలపై ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని... వాటన్నింటికీ తాను హాజరవుతానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఇదీ చదవండి: PRC: విద్యాశాఖ ఒప్పంద, పొరుగ సేవ ఉద్యోగుల పీఆర్సీపై కసరత్తు

Last Updated :Jul 29, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.