ETV Bharat / state

KTR: తైవాన్​ కంపెనీల పెట్టుబడులకు అపార అవకాశాలు: కేటీఆర్

author img

By

Published : Jul 28, 2021, 8:52 PM IST

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్​ కంపెనీలకు అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న తైవాన్​ ఎకనమిక్​ కల్చరల్​, ట్రేడ్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​ ప్రతినిధులకు హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో ఘనస్వాగతం పలికారు.

Minister KTR Meet Taiwan team
తైవాన్​ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా తైవాన్​ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​లో పెట్టుబడులు పెట్టేందుక అపారమైన అవకాశాలున్నాయని వారికి సూచించారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న తైవాన్​ ఎకనమిక్​ కల్చరల్​, ట్రేడ్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​ ప్రతినిధులకు హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సాదరంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడుల ప్రోత్సాహానికి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు తైవాన్ బృందం సానుకూలంగా స్పందించింది. వారు ఆసక్తిని కనబరచటంతో పాటు త్వరలోనే తైవాన్ కంపెనీలతో ఓ వర్చువల్ పెట్టుబడి సదస్సు నిర్వహిస్తామని తైవాన్ డైరెక్టర్ జనరల్ వాంగ్ మంత్రి కేటీఆర్​కు హామీ ఇచ్చారు.

ప్రత్యేక ఇండస్ట్రియల్​ పార్కు ఏర్పాటుకు సిద్ధం

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, ముఖ్యంగా టీఎస్​ ఐపాస్​ లాంటి ప్రభుత్వ విధానాలను టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్​కు మంత్రి కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా తైవాన్​కు చెందిన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర ప్రాధాన్య రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి చెప్పారు. తైవాన్​కు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను స్వయంగా తైవాన్​లో పర్యటించి తెలంగాణలోని వ్యాపార అనుకూలతపై జరిపిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం - తైవాన్ పారిశ్రామిక వర్గాల పెట్టుబడులకు సంయుక్త భాగస్వామ్యంలో ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్​ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. తైవాన్- తెలంగాణ మధ్య పెట్టుబడుల విషయంలో సహకరించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్​ను మంత్రి కేటీఆర్ కోరారు.

తమ సహకారం అందిస్తాం: టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్

రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతపై తనకు అవగాహన ఉందని... ఇక్కడ ఉన్న పెట్టుబడి అవకాశాలను తైవాన్ పారిశ్రామిక రంగానికి పరిచయం చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​కు డైరెక్టర్ జనరల్ వాంగ్ హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్ ఇన్వెస్ట్​మెంట్​ సెషన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తైవాన్ ఎకనమిక్ కల్చరల్ సెంటర్​ (TECC), తైవాన్​ ఎక్స్​టర్నల్ ట్రేడ్​ ​ డెవలప్​మెంట్​ (Taiwan External Trade Development Council - TAITRA), ఇన్వెస్ట్ ఇండియా సంయుక్త ప్రతినిధి బృందానికి.. ఐటీ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్, ఈవీ (EV) డైరెక్టర్ సుజయ్ కారంపూరి ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న వివిధ పెట్టుబడి అవకాశాలపైన వివరాలు అందించారు.

ఇదీ చూడండి: KTR: మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.