ETV Bharat / state

'హైదరాబాద్​ను సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు చర్యలు'

author img

By

Published : Apr 5, 2021, 11:54 AM IST

Updated : Apr 5, 2021, 2:49 PM IST

Hi-Tech City, MINISTER KTR
హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభించిన కేటీఆర్

కరోనా పూర్తిగా పోలేదని... మరోసారి లాక్​డౌన్ రావొద్దంటే ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో రూ. 3500 కోట్ల వ్యయంతో డ్రైనేజి, సీవరేజ్ ఆధునీకరణ పనులను చేపడుతున్నట్టు వెల్లడించారు. కూకట్​పల్లి నియోజకవర్గ పరిధిలో రూ.71.49 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కైతలాపూర్​లో వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన సందర్భంగా మంత్రి స్థానికులతో మాట్లాడారు.

మంత్రి కేటీఆర్ ఇవాళ సుడిగాలి పర్యటన చేశారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ. 66.59 కోట్లతో నిర్మించిన ఆర్.యు.బిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్.యూ.బి ప్రారంభంతో హైటెక్ సిటీ, ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషన్ మార్గంలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా వెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ ప్రాంత వాసులకు మరింత వెసులుబాటు అయింది. మూసాపేట్ సర్కిల్​లోని అంబేడ్కర్​నగర్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు రూ.99లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. కేపీహెబీ కాలనీ నాలుగో ఫేజ్​లో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభించారు. హైటెక్ సిటీ ఆర్వోబీ వద్ద రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు.

గత టర్మ్​లో ఏవిధంగానైతే రూ.3వేల కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీటిని అందించి నీటి కొరత లేకుండా నీటిని అందించామో అదేవిధంగా ఈసారి కూడా రూ. 3500 కోట్ల వ్యయంతో శివారు ప్రాంతాలలో డ్రైనేజి, సీవరేజ్ ఆధునీకరణ పనులను చేపడున్నట్లు కేటీఆర్ తెలిపారు. భారీ వర్షాలతో కాలనీలు, బస్తీలు మరోసారి ముంపునకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కైతలాపుర్​లోని ట్రాన్స్​ఫర్ స్టేషన్​ ఆధునీకరించడం కోసం స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని హామీఇచ్చారు. ఇక్కడ గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన గృహాలకు మరమ్మతులు చేయిస్తామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్షి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

'హైదరాబాద్​ను సిగ్నల్ ఫ్రీ రహదారుల నగరంగా మార్చేందుకు చర్యలు'
Last Updated :Apr 5, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.