ETV Bharat / state

జనం జేబులకు చిల్లులు పెట్టడమే భాజపా ప్రభుత్వ విధానం: మంత్రి కేటీఆర్

author img

By

Published : Dec 17, 2022, 6:57 AM IST

KTR Fires On Modi Government : పెట్రో ధరలు తగ్గించేందుకు ముందుకురాని కేంద్రం.. కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు లాభం తగ్గించేలా విండ్ ఫాల్‌టాక్స్ తగ్గించిందని.. మంత్రి, భారాస నేత కేటీఆర్ ఆరోపించారు. మోదీ సర్కారు కార్పొరేట్ల కోసమే పని చేస్తోందని.. సాధారణ ప్రజల కోసం కాదని ధ్వజమెత్తారు. ఆయిల్ కంపెనీల లాభాలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. పెట్రో ధరల పెంపులో ఏ ప్రమేయం లేని తెలంగాణ వంటి రాష్ట్రాలపై దుష్ప్రచారాన్ని ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

minister ktr
మంత్రి కేటీఆర్

మోదీ విధానాలతో ప్రజానీకానికి భారంగా మారిన పెట్రోల్ ధరలు

KTR Fires On Modi Government : ప్రధానిమోదీ ప్రభుత్వం కార్పొరేట్ల సర్కారుగా మారిందని.. కామన్ మ్యాన్ కోసం పని చేయట్లేదని మంత్రి, భారాస నేత కె. తారక రామారావు విమర్శించారు. అడ్డగోలుగా పెంచిన ఎక్సైజ్‌డ్యూటీ, సెస్సులు, పన్నులు ప్రజానీకానికి భారంగా మారిన పెట్రో ధరలను తగ్గించకుండా.. కార్పొరేట్ ఆయిల్ కంపెనీలపై విండ్ ఫాల్ టాక్స్‌ తగ్గించిందని మండిపడ్డారు. కార్పొరేట్లకు వరాలిస్తూ.. సామాన్యులపై భారం మోపడం, చమురు కంపెనీలకు లాభాలు వచ్చేలా చూస్తూ.. జనం జేబులకు చిల్లులు పెట్టడమే భాజపా ప్రభుత్వ విధానంగా మారిందన్నారు. కార్పొరేట్ కంపెనీలే తమ తొలి ప్రాధాన్యమని.. దేశ ప్రజలు కాదని మోదీ సర్కారు మరోసారి నిరూపించిందన్నారు.

కార్పొరేట్ కంపెనీలు అడ్డగోలుగా సంపాదించిన చమురు సొమ్ము ఎవరి జేబుల్లోకి వెలుతున్నాయో అందరికీ తెలుసని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపించి.. సామాన్య ప్రజలను భాజపా ప్రభుత్వం దోచుకుందని కేటీఆర్ విమర్శించారు. పెట్రో రేట్లు తగ్గించడానికి రష్యా నుంచి తక్కువ రేటుకి ముడి చమురు కొంటున్నామని గొప్పలు చెప్పుకున్న మోదీ ప్రభుత్వం.. ఆ ఇంధనాన్ని దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు ఎందుకు అనుమతిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రష్యా నుంచి తక్కువ ధరకు కొని.. దేశంలో విక్రయించకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి కార్పొరేట్ ఆయిల్ కంపెనీలు అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములపై.. పన్నుల తగ్గింపుపై ఆంతర్యం ఏంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. కార్పొరేట్ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రధాని మోదీ విండ్ ఫాల్ టాక్స్‌ని తగ్గించారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ వంటి రాష్ట్రాలు 2014 నుంచి వ్యాట్‌ను ఏమాత్రం పెంచకున్నా.. వ్యాట్‌ని తగ్గించట్లేదంటూ పార్లమెంట్‌ సాక్షిగా ప్రజలను మోదీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని కేటీఆర్ విమర్శించారు. సెస్‌ల పేరుతో రూ.30 లక్షల కోట్లు కొల్లగొట్టి.. రాష్ట్రాల పన్నుల వాటాకు ఎసరు పెట్టడమే కాకుండా తిరిగి రాష్ట్రాలపై కేంద్రం నిందలు వేస్తోందని మండిపడ్డారు.

దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు రాష్ట్రాల వ్యాట్ పెంపు కారణం కాదన్న కేటీఆర్.. మోదీ ప్రభుత్వం భారీగా పెంచిన సెస్సుల ఫలితంగానే రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. సెస్‌ల రూపేణా ఇప్పటి వరకు రూ.30 లక్షల కోట్లను ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకుందని వాటిని తగ్గిస్తే పెట్రోల్‌ రూ.70, డీజిల్ రూ.60కే అందించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. కానీ తన కార్పొరేట్ మిత్రుల ప్రయోజనాల కోసం ఎన్నో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. ఆ ఒక్క విషయంలో దేశ ప్రజలమీద జాలిచూపిస్తే పెట్రో రేట్లు భారీగా తగ్గి సామాన్యుడికి లాభం కలుగుతుందని కేటీఆర్‌ చెప్పారు.

ధరల తగ్గింపుపై రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం ప్రకటించాలని కేటీఆర్ హితపు పలికారు. పన్నులు, సెస్సులు పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపిన కేంద్రం, ఇప్పటికైనా ఆ నెపాన్ని రాష్ట్రాలపైకి అన్యాయంగా నెట్టడాన్ని ఆపాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.