ETV Bharat / state

జీహెచ్​ఎంసీ పరిధిలో త్వరలోనే 1,540 ఆశా పోస్టుల భర్తీ: హరీశ్​రావు

author img

By

Published : Feb 12, 2023, 12:37 PM IST

Minister Harish Rao Speech in Assembly: బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు వరంగా మారాయని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 ఆశా పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

Health Minister Harish Rao
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Speech in Assembly: అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో భాగంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు బస్తీ దవాఖానాల గురించి మాట్లాడారు. బస్తీ దవాఖానాలు పేదల ప్రజలకు వరంగా మారాయని తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బస్తీ దవాఖానాలతో పేద ప్రజల సుస్తి నయమవుతోందని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1540 ఆశా కార్యకర్తల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

లిపిడ్‌ ప్రొఫైల్‌, థైరాయిడ్‌ వంటి ఖరీదైన పరీక్షలను కూడా బస్తీ దవాఖానాల్లో చేస్తున్నట్లు హరీశ్​రావు తెలిపారు. బస్తీ దవాఖానాల వల్ల ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌, ఫీవరాసుపత్రిపై ఔట్‌ పేషంట్‌ భారం తగ్గిందని చెప్పారు. మార్చి నెలాఖరు కల్లా 134 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. 158 రకాల మందులను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

త్వరలోనే బస్తీ దవాఖానాల్లో బయోమెట్రిక్ విధానం తీసుకొస్తామని వెల్లడించారు. ప్రస్తుతం సుమారు కోటి మంది ప్రజలు చికిత్స పొందారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్​లో అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. బస్తీ దవాఖానాలకు శనివారం సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు.

బస్తీ దవాఖానాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా పేద ప్రజల సుస్తిని నయం చేస్తున్నాయి. ప్రస్తుతం 57 రకాల వైద్య పరీక్షలు ఈ ఆస్పత్రిలో జరుగుతున్నాయి. మార్చి నెలాఖరుకు 134 రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు సన్నద్దం అవుతున్నాం. శనివారం ప్రభుత్వ ఆస్పత్రులకు సెలవు నిర్ణయం తీసుకున్నాం.-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.