27 మెట్రో స్టేషన్లలో సిబ్బంది ఆందోళన.. చర్చలతో ధర్నాకు తాత్కాలిక బ్రేక్

author img

By

Published : Jan 3, 2023, 1:38 PM IST

Updated : Jan 3, 2023, 2:25 PM IST

Hyderabad Metro Staff Protest
Hyderabad Metro Staff Protest ()

13:34 January 03

ధర్నా విరమించిన మెట్రో టికెటింగ్‌ సిబ్బంది

Hyderabad Metro Staff Protest : హైదరాబాద్​ నగరంలోని మెట్రో రైలు టికెట్‌ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ కారిడార్‌లోని 27 మెట్రో స్టేషన్లలోనూ ఆందోళన చేపట్టారు. ఆయా స్టేషన్ల వద్ద టికెటింగ్‌ ఉద్యోగులు ధర్నాలకు దిగి తమ నిరసన తెలిపారు. గత కొంతకాలంగా సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు మెట్రో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్‌ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం ఇవ్వడం లేదని ఆక్షేపించారు. వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చిచెప్పారు. దీనిపై కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ కియోలిస్‌ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆరోపణలు అవాస్తవం: నిర్వాహకులు

Short break to Hyderabad Metro Staff Protest : మరోవైపు సిబ్బంది ఆందోళనపై కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ కియోలిస్‌ ప్రతినిధులు స్పందించారు. టికెటింగ్‌ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ట్రైన్‌ ఆపరేషన్‌ నిలిపివేసేందుకే సిబ్బంది విధుల్లోకి రాలేదన్నారు. సమయం ప్రకారమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ధర్నా చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. చర్చలు జరుపుతామని హామీ ఇచ్చినా టికెటింగ్‌ స్టాఫ్‌ ఆందోళన కొనసాగించారు. దీంతో కియోలిస్‌ ప్రతినిధులు అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో వారితో చర్చలు జరిపారు.

అప్పటి వరకు విధులకు వెళ్లం: టికెటింగ్‌ ఉద్యోగులు

చర్చలు ముగిసిన అనంతరం మెట్రో టికెటింగ్‌ సిబ్బంది మాట్లాడుతూ తాత్కాలికంగా ధర్నా విరమిస్తున్నామని.. మరోసారి చర్చలకు రావాలని యాజమాన్యం కోరిందని చెప్పారు. ప్రధానంగా వేతనాలు పెంచాలని తాము డిమాండ్‌ చేశామన్నారు. మరోసారి కియోలిస్‌ ప్రతినిధులతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

Last Updated :Jan 3, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.