ETV Bharat / state

May Day Celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మే డే వేడుకలు

author img

By

Published : May 1, 2023, 8:23 PM IST

May Day Celebrations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా కార్మిక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో మే డేను నిర్వహించారు. ఊరూవాడా జెండాలను ఆవిష్కరించి.. శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల హక్కులను సాధించే దిశగా సంఘటితం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.

మేడే
మేడే

May Day Celebrations in Telangana: తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ, పరోక్షంగా సమాజాభివృద్ధిలో భాగస్వాములౌతున్న ప్రతి ఒక్క కష్టజీవికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ మే డే శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదని, మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాది రాళ్లని సీఎం కేసీఆర్ తెలిపారు. కార్మిక కర్షక సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు.

మోదీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మే డే సందర్భంగా సిద్దిపేటలో సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను రద్దు చేసి.. హక్కులను మోదీ సర్కార్ కాలరాస్తోందని చాడ విమర్శించారు. మే డేను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం వద్ద ఎర్రజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మే డే ప్రాధాన్యతను వివరిస్తూ గేయాలను ఆలకించారు. హక్కుల పరిరక్షణ కోసం మే డే స్ఫూర్తిని కొనసాగించాలని ఆ పార్టీ నేత జ్యోతి పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు.

ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో.. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రహదారిపై భారీ ప్రదర్శన చేపట్టారు. మోదీ సర్కారు అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాత చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు చేసే ఆలోచనలు కేంద్రం విరమించుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. హనుమకొండ జిల్లా పరకాలలో మే డే సందర్భంగా పలువురు నేతలు జెండా ఆవిష్కరించారు. కార్మికులంతా తమ హక్కులను సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు.

చికాగో అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జాతీయ కార్మిక సంఘాల నేతల ఆధ్వర్యంలో.. ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకుంటి చందర్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. కాబట్టి కార్మికులంతా ఐక్యమత్యంగా పోరాటం చేయాలని సూచించారు.

134 ఏళ్ల క్రితం కార్మికులు తమ పని గంటలను తగ్గించాలని పోరాటం చేసి విజయం సాధించిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ.. మే డే జరుపుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ వద్ద బీఆర్​ఎస్ కార్మిక సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్‌ నుంచి ఇల్లందు కూడలి వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల కార్మికులకు వేతనాలు పెంచడమే కాకుండా వారికి ఉచిత వైద్యసేవలు అందిస్తుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 137వ మే డే వేడుకల్లో దివాకర్‌ రావు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో మే డే సందర్భంగా బీఆర్​ఎస్ అనుబంధ సంస్థ ట్రేడ్ యూనియన్ కార్మికులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెండా ఆవిష్కరించారు. మే డే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు కార్మికులు చేరుకుని జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.