ETV Bharat / state

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో ముందడుగు.. భూసేకరణకు మార్గం సుగమం

author img

By

Published : Mar 18, 2022, 5:14 AM IST

Regional Ring Road: హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణదిశగా మరో కీలక అడుగుపడింది. జిల్లాలవారీగా భూసేకరణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Regional Ring Road
Regional Ring Road

Regional Ring Road: హైదరాబాద్‌ ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణదిశగా మరో ముందడుగు పడింది. జిల్లాలవారీగా భూసేకరణకు వీలుగా అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి, యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు, సిద్దిపేట జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం ఎనిమిది బృందాలు భూసేకరణ వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. 344 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా రింగు రోడ్డు నిర్మించనున్న విషయం తెలిసిందే.

జాతీయ రహదారి హోదా..

కేంద్ర ప్రభుత్వం 158.50 కిలోమీటర్ల ఉత్తర భాగానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ 161(ఎ)(ఎ) నంబరు కూడా కేటాయించింది. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగరి జిల్లాల పరిధిలోని సంగారెడ్డి- నర్సాపూర్‌ - తూప్రాన్‌ - గజ్వేల్‌ - జగ్దేవ్‌పూర్‌ - భువనగిరి - చౌటుప్పల్‌ మీదుగా వెళ్లే ఉత్తర భాగం కోసం 4,760 ఎకరాలు, 12 ప్రాంతాల్లో కూడళ్ల కోసం మరికొంత భూమిని సేకరించాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లోని మలుపుల ఆధారంగా ఎంత వేగంతో వాహనాలు రాకపోకలు సాగిస్తాయన్నది నిర్ధరించాక, కూడళ్లకు ఎంత భూమి అవసరమో అధికారులు నిర్ణయిస్తారు.

వంద మీటర్ల వెడల్పున..

ఎనిమిది వరుసల ఈ రహదారిలో తొలివిడత రెండేసి చొప్పున నాలుగు వరుసలు నిర్మిస్తారు. ఎనిమిది వరుసలకు వీలుగా వంద మీటర్ల వెడల్పున భూమిని ఇప్పుడే సేకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. భూసేకరణకు సుమారు రూ. 2,120 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రింగు రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించింది.

ఉత్తర భాగం వెళ్లే మార్గాలను కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే మార్కింగ్‌ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. దాని తర్వాత కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. భూసేకరణ ప్రక్రియ కొంత కొలిక్కి వచ్చిన తరువాత టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది.ఈ రహదారి నిర్మాణ వ్యయాన్ని భారత్‌మాల పథకం కింద కేంద్రమే భరిస్తుంది.

ఇదీ చదవండి:KTR Comments: 'రాబోయే 6 నుంచి 9 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం'


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.