ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర కేసుతో సంబంధం లేకుంటే కిషన్​రెడ్డి సంబురాలు ఎందుకు?'

author img

By

Published : Dec 27, 2022, 9:44 PM IST

Updated : Dec 28, 2022, 7:52 AM IST

KTR Fires on Kishan Reddy : ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును సీబీఐకి అప్పగిస్తే కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సంబురాలు చేసుకున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తమ జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకే సంబురమా అని ప్రశ్నించారు. తమకు సంబంధం లేదని భుజాలు తడుముకున్నోళ్లు దొంగలను భుజాలపై మోస్తున్నారని వ్యాఖ్యానించారు. దొరికిన ముగ్గురికీ నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలు చేస్తే బీజేపీతో సంబంధాలు బయటపడుతాయని దానికి సిద్ధమేనా అని కేటీఆర్ సవాల్ చేశారు. కిషన్​రెడ్డికి దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు.

KTR fire on Kishan Reddy
KTR fire on Kishan Reddy

KTR Fires on Kishan Reddy : ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే కేంద్ర మంత్రి, బీజేపీ సంబరాలు చేసుకోవడంలో మర్మమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లిగా బయటకు వచ్చాయని, దొంగలు తమ నిజమైన రంగులు బయట పెట్టుకుంటున్నారని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. దొరికిన స్వామీజీలతో అసలు సంబంధమే లేదన్నోళ్లు కేసు సీబీఐకి అప్పగించగానే సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

బండారమంతా కెమెరాకు చిక్కినప్పుడే, బీజేపీ నేతల వెన్నులో వణుకు మొదలైందన్నారు. మొదట భుజాలు తడుముకుని ఇప్పుడెందుకు వాళ్లను భుజాలపై మోస్తున్నారని ప్రశ్నించారు. ఏ సంబంధం లేకపోతే కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు పలుమార్లు కోర్టుల్లో ఎందుకు ప్రయత్నం చేశారన్నారు. సీబీఐకి అప్పగిస్తే సంబరమెందుకని కిషన్‌రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్.. తమ జేబు సంస్థ చేతికి కేసు చిక్కినందుకేనా అని అన్నారు.

పంజరంలో చిలుక తాము చెప్పినట్టే పలుకుతుందని చెప్పకనే చెబుతున్నారా అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసు సీబీఐకి వెళ్తే, తమ బారా ఖూన్ మాఫ్ చేసి క్లీన్‌చిట్ ఇవ్వడం పక్కా అని ఇంత బహిరంగంగా మాట్లాడతారా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తీరుకు బీజేపీని సిగ్గు ప్రకటనలే నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.

ఒకప్పుడు సీబీఐకి కేసు ఇస్తే నిందితులు భయపడే వారని ఇవాళ సీబీఐకి కేసు అప్పగిస్తే సంబరాలు చేసుకుంటున్నారంటే ఆ దర్యాప్తు సంస్థను బీజేపీ హయాంలో ఎంత నీరుగార్చారో అర్థమవుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించి కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిన దొంగలని కేటీఆర్ విరుచుకుపడ్డారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు బీజేపీ వ్యవహారం ఉందన్నారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంలో కాంగ్రెస్‌ను బీజేపీ మించిపోయిందని ధ్వజమెత్తారు.

ఒకప్పుడు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే వారని ఇప్పుడు దేశప్రజలు సీబీఐని సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటున్నారన్నారు. సీబీఐ దర్యాప్తుతో పాటు కేసులో దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. దొరికిన ముగ్గురికీ లైడిటెక్టర్ టెస్టులు చేస్తే వారికీ బీజేపీకు ఉన్న బంధమేంటో తేటతెల్లమవుతుందన్న కేటీఆర్ దమ్ముంటే కిషన్​రెడ్డి సవాల్ స్వీకరించాలన్నారు.

బీజేపీను కొత్తగా బద్నాం చేయాల్సిన ఖర్మ తమకు లేదని అధికార బలంతో ఏమైనా చేయవచ్చునన్న కుటిలనీతితో ఎనిమిదిన్నరేళ్ల పాలనతో ప్రజాక్షేత్రంలో బీజేపీ ఎప్పుడో బద్నాం అయిపోయిందని విమర్శించారు. బీజేపీ వద్ద విషయం లేదు కాబట్టే ఎనిమిదేళ్లుగా ప్రత్యర్థి పార్టీలపై దర్యాప్తు సంస్థలతో విషప్రయోగం చేస్తున్న మాట నిజం కాదా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బీజేపీ వద్ద సరుకు లేదు కాబట్టే ఎమ్మెల్యేలను అంగడి సరుకులా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తున్న మాట వాస్తవం కాదా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రచేసి ఆపరేషన్ లోటస్ బెడిసి కొట్టి అడ్డంగా దొరికిన దొంగలు బీజేపీ నేతలని కేటీఆర్ మండిపడ్డారు. ఈ దేశంలో గత ఎనిమిదేళ్లలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన సిగ్గులేని చరిత్ర మీదని దొంగలకు సద్దులు మోసిన బీజేపీ నేతలు, ఇప్పుడు సుద్దులు చెబితే నమ్మేదెవరన్నారు.

మీ చేతిలోని కీలుబొమ్మలు సాగించే విచారణ ఎలా ఉంటుందో అందరికీ తెలుసన్న కేటీఆర్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రల బండారంపై నిజమైన ప్రజాక్షేత్రంలో బీజేపీపై విచారణ ఎప్పుడో ప్రారంభం అయ్యిందన్నారు. నేరం చేసినవాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరన్నారు. ఈ విషయంలో సరైన సమయంలో బీజేపీపై తీర్పు చెప్పేందుకు యావత్ భారత సమాజం కూడా సిద్ధంగా ఉందని కేటీఆర్‌ అన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 28, 2022, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.