ETV Bharat / state

Ration Cards: ఆదిలోనే అనర్హులకు చెక్‌.. పక్కాగా జారీ!!

author img

By

Published : Jun 19, 2021, 7:23 AM IST

ration cards
Ration Cards: ఆదిలోనే అనర్హులకు చెక్‌.. పక్కాగా జారీ!!

తెలంగాణలో పక్కాగా కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయనున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను '360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌'తో పౌరసరఫరాల శాఖ జల్లెడ పడుతోంది. ప్రస్తుతానికి కొత్త కార్డులే ఇవ్వనున్నారు. మార్పుచేర్పులకు అవకాశం లేదు.

రేషన్‌ కార్డుల జారీలో అనర్హులకు చెక్‌ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను '360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌'తో జల్లెడ పడుతోంది. ఈ ప్రాథమిక ప్రక్రియలో అర్హులని తేలితేనే ఆ దరఖాస్తును పరిశీలిస్తారు. లేదంటే తిరస్కరించినట్లు సంబంధిత దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులను చాలా మంది తీసుకోవడం లేదు. సరకుల కోటా చాలా వరకు మిగిలిపోతుంది. ఎందుకీ పరిస్థితి అని అప్పట్లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆరా తీయగా ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందడానికే చాలామంది రేషన్‌ కార్డులను తీసుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను, ఇంటి పన్ను చెల్లించేవారు, ప్రభుత్వోద్యోగులు, పింఛను తీసుకునే వారు, కారు కలిగి ఉన్న వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా వారి కార్డులను తొలగించారు.

ఈ లెక్కన ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే లక్ష నుంచి 1.5 లక్షల కార్డులను రద్దుచేశారు. ఈ జాబితాలో పలువురు అర్హులు కూడా ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గతంలో మాదిరిగా విమర్శలు రాకుండా, అనర్హులకు కార్డులు దక్కకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఎన్‌ఐసీ, ఐటీ తదితర శాఖలు సంయుక్తంగా రూపొందించిన ‘360 డిగ్రీలు’ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, ఉద్యోగులు.. ఇలా పౌరులకు సంబంధించి వివిధ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని పొందుపర్చారు. రేషన్‌ కార్డు దరఖాస్తులో పేర్కొన్న ఆధార్‌ నంబరు సాయంతో ఈ జాబితాలో సదరు దరఖాస్తుదారులు ఉన్నారో లేదో జల్లెడ పడుతున్నారు. ఒకవేళ ఉంటే ఆ దరఖాస్తును అప్పటికప్పుడు తిరస్కరిస్తున్నారు. లేకపోతే సదరు దరఖాస్తును సంబంధిత జిల్లా అధికారులకు పంపుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 95 వేల దరఖాస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇటీవలే ఐటీ శాఖకు పంపించారు. అక్కడి నుంచి సమాచారం అందగానే తదుపరి పక్రియను ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

25లోగా దరఖాస్తుల పరిశీలన..

పెండింగులో ఉన్న రేషన్‌కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో 4.97 లక్షల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగులో ఉన్నాయి. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులను గుర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ప్రస్తుతానికి నూతన కార్డుల జారీ ప్రక్రియ మాత్రమే చేపట్టాలని నిర్ణయించారు. కార్డుదారుల కుటుంబ సభ్యుల్లో మార్పులు చేర్పులకు ఇప్పుడు అవకాశం లేదని ఉత్తర్వుల్లో తెలిపారు. కొన్ని జిల్లాల్లో పౌరసరఫరాల శాఖలో చాలినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఆయా జిల్లాల్లో ఇతర విభాగాల నుంచి సిబ్బందిని కేటాయించాల్సిన బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.

వేగంగా పూర్తిచేయాలి: మంత్రి గంగుల

అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులను అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి తగినట్లుగా దరఖాస్తుల పరిశీలనను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి అన్ని జిల్లాల అధికారులతో ఆయన దృశ్య సమీక్షలో మాట్లాడారు. రాష్ట్రంలో 1,454 చౌకధరల దుకాణాల డీలర్లను నియమించాల్సి ఉందని.. త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి: బ్లాక్‌ ఫంగస్‌ ఎలా ప్రవేశిస్తుంది? ఎవరిలో ఎక్కువ ముప్పు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.