ETV Bharat / state

నిధులు పారలేదు.. కొత్త ఆయకట్టుపై సర్కారు ఆశలు నెరవేరలేదు

author img

By

Published : Feb 5, 2023, 9:54 AM IST

Irrigation
Irrigation

Irrigation Department Unspent Money as per Estimates: ఈ ఏడాది కేటాయింపుల మేరకు నిధులు విడుదల కాకపోవడం, ఆర్థిక సంస్థలు ఒప్పందం మేరకు రుణాలు ఇవ్వకపోవడం వంటి పరిణామాల ప్రభావం సాగునీటి రంగంపై తీవ్ర ప్రభావమే చూపింది. దాంతో సాగునీటి శాఖలో అంచనాల మేరకు సొమ్ము ఖర్చుకాలేదు. వ్యయమైన చోటా డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాని పరిస్థితి నెలకొంది.

Irrigation Department Unspent Money as per Estimates: కేటాయింపుల మేరకు నిధులు విడుదల కాకపోవడం, ఆర్థిక సంస్థలు ఒప్పందం మేరకు రుణాలు ఇవ్వకపోవడం వంటి పరిణామాల ప్రభావం సాగునీటి రంగంపై తీవ్ర ప్రభావమే చూపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 12.93 లక్షల ఎకరాల ఆయకట్టును అదనంగా సాగులోకి తేవాలన్న ప్రభుత్వ ఆశలను వమ్ము చేసింది. ప్రధానంగా కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల కింద భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నా.. అవేమీ కార్యరూపం దాల్చలేదు. డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడం, ప్రధాన పనులకు కూడా ఒప్పందం మేరకు ఆర్థిక సంస్థలు నిధులు విడుదల చేయకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందని నీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర సర్కారు బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు నిధులను సాగునీటి శాఖపై ఖర్చుచేసింది. తర్వాత సంవత్సరం ప్రాజెక్టుల పునరాకృతిపై దృష్టిసారించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాగునీటి రంగంలో భారీగా ఖర్చుచేసింది. అటు రాష్ట్ర ఖజానా, ఇటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన రుణాలతో పనుల్లో వేగం పెంచింది. 2016-17లో సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చుచేయగా, తర్వాత సంవత్సరం నుంచి రూ.20 వేల కోట్లకు పైగానే వ్యయం చేసింది. 2018-19లో ఖర్చు ఏకంగా రూ.31,500 కోట్లకు చేరింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సాగునీటి రంగంపై చేసిన ఖర్చు కంటే ఇది ఎక్కువ.

మునుపటి వేగం ఏది: సాగునీటి రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,905 కోట్లు బడ్జెట్‌ కేటాయింపులు చేసిన సర్కారు, మిగిలింది రుణాలుగా తీసుకుని మొత్తంగా రూ.20 వేల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు సుమారు రూ.12,500 కోట్లే ఖర్చు చేసింది. అందులో బడ్జెట్‌ కేటాయింపుల్లోంచి వెచ్చించింది రూ.6,500 కోట్లే. ఇది ఈ సంవత్సరానికి నిర్దేశించుకున్న ఆయకట్టు లక్ష్యాన్ని అందుకునేందుకు ఏ మాత్రం సరిపోలేదు. కొన్ని ప్రాజెక్టుల కింద కేటాయింపుల మేరకు ఖర్చుచేసినప్పటికీ, అక్కడ డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి కాకపోవడంతో లక్ష్యం మేరకు ఆయకట్టుకు సాగునీరు అందలేదు.

ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తిచేసి, 6.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనేది సర్కారు లక్ష్యం. బడ్టెట్‌ కేటాయింపులు, రుణాలు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలోనే సుమారు రూ.ఎనిమిదివేల కోట్లు ఖర్చు చేసింది. డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకపోవడం, పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేయలేకపోవడంతో ఆ మేరకు ఆయకట్టు అందుబాటులోకి రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2023 మార్చి నాటికి పూర్తిచేసి, 3.28 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనేది వ్యూహం. ఇక్కడ కేటాయింపుల మేరకు నిధులు ఖర్చుచేయకపోగా, డిస్ట్రిబ్యూటరీ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, గట్టు, దేవాదుల తదితర ప్రాజెక్టులన్నిటిలోనూ ఇదే పరిస్థితి.

.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.