ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర కేసు'లో.. ముగ్గురు నిందితులు ఎలా కలిశారు..? ఏ కుట్ర పన్నారు..?

author img

By

Published : Nov 13, 2022, 7:19 AM IST

Investigation by SIT Team: ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ బృందం విచారణ ముమ్మరమైంది. తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడిన రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ గత సమావేశాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ముగ్గురు నిందితులు ఎలా కలిశారు, ఏ విధంగా కుట్ర పన్నారు అనే అంశాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఫిలింనగర్​లోని నిందితుడు నందకుమార్​కు చెందిన దెక్కన్ ప్రైడ్ హోటల్, నివాసంలో సిట్ పోలీసులు సోదాలు చేశారు.

Investigation by SIT Team
Investigation by SIT Team

'ఎమ్మెల్యేల ఎర కేసు'లో.. ముగ్గురు నిందితులు ఎలా కలిశారు..? ఏ కుట్ర పన్నారు..?

Investigation by SIT Team: తెరాస ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు, ప్రలోభపెట్టిన వ్యవహారంలో నిందితుల కస్టడీ పూర్తయిన తర్వాత కేసు తదుపరి దర్యాప్తును సిట్‌ వేగవంతం చేసింది. విచారణపై సిట్‌ చీఫ్‌ సీవీ ఆనంద్‌ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ఎప్పటి నుంచి ప్రణాళికలు రచించారు, గతంలో ఎన్నిసార్లు సమావేశమయ్యారు, వారి మధ్య జరిగిన సంభాషణలేమిటి వంటి అంశాలను నిరూపించగలిగితే, కేసు కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డినే తొలుత ఎంచుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. నందకుమార్‌ వ్యవహారశైలిని లోతుగా ఆరాతీస్తున్నారు. నందకుమార్‌ వ్యాపారాలు, గతంలో అతనిపై కేసులు ఏమైనా ఉన్నాయా అనే వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతిలో ఆశ్రమం నిర్వహించే సింహయాజిని పలువురు రాజకీయ ప్రముఖులకు ఆశీర్వాదం పేరుతో నందకుమార్‌ పరిచయం చేసినట్టు పోలీసులు గుర్తించారు.

అదే పరిచయంతోనే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అంశంపై చర్చించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈక్రమంలో దిల్లీకి చెందిన రామచంద్రభారతితో సంప్రదింపులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. వారి మధ్య జరిగిన ఫోన్‌ కాల్స్‌, వాట్సప్‌ సంభాషణలు కీలకం కానుండటంతో వాటిని విశ్లేషించటంపై సిట్‌ అధికారులు దృష్టి సారించారు.

రామచంద్రభారతి సెల్‌ఫోన్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో జరిగిన చాటింగ్‌లను క్రోడీకరించి, ఈ కేసులో సమగ్ర నివేదికను రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఈ కేసుకు సంబందించి ఇతర రాష్ట్రాల ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నందకుమార్‌కు చెందిన పలు ప్రాంతాల్లో, సిట్‌ సోదాలు చేసింది.

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని హిల్‌టాప్‌లో నందకుమార్‌ నివాసం, అతను నిర్వహిస్తున్న దక్కెన్‌ హోటల్‌లోనూ సిట్‌ తనిఖీలు చేసింది. నందకుమార్‌ నివాసంలో 6గంటలపాటు సోదాలు కొనసాగాయి. తనిఖీల సమయంలో నందకుమార్‌ భార్య, కుమారుడు ఇంట్లోనే ఉన్నారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. చైతన్యపురిలో నందకుమార్‌ తల్లిదండ్రుల నివాసంలోను పోలీసులు సోదాలు నిర్వహించారు. నందకుమార్​కు చెందిన హోటల్‌లో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. గతంలో నిందితులు ఇదే హోటల్‌లో బసచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజీ లభిస్తే కేసు దర్యాప్తులో కీలకంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.