ETV Bharat / state

కొత్త సంపదను సృష్టిస్తోన్న చేపలు, రొయ్యల పెంపకం

author img

By

Published : Nov 6, 2020, 6:40 AM IST

రాష్ట్రంలో చేపలు, రొయ్యల పెంపకం మత్స్యకారులకు కొండంత ఆసరాగా నిలుస్తోంది. ప్రభుత్వం నీటి వనరుల్లో చేపపిల్లలను వదలడం వల్ల లభ్యత భారీగా పెరిగిపోయింది. పల్లెల్లో చెరువులో పుష్కలంగా నీళ్లు ఉండటం చేపల పెంపకానికి అనువుగా మారింది. రాష్ట్రంలో చేపలు, రొయ్యల పెంపకంతో ఆదాయం భారీగా పెరిగిపోయింది. చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు సర్కారు దృష్టి సారిస్తోంది.

Increased income from fish and shrimp farming in telangana
కొత్త సంపదను సృష్టిస్తోన్న చేపలు, రొయ్యల పెంపకం

రాష్ట్రంలో చేపలు, రొయ్యల పెంపకం కొత్త సంపదను సృష్టిస్తోంది. నిరుపేదలైన మత్స్యకారులకు కొండంత ఆసరాగా నిలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలామందికి ఇది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పెంపకందారులే కాకుండా, అమ్మకాలు సాగించేవారు, చేపలతో ఇతర ఉత్పత్తులు తయారు చేసేవారు.. ఇలా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో చేపల పెంపకం పెద్దగా ఉండేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా నీటి వనరుల్లో చేప పిల్లలను వదలడం వల్ల ఇప్పుడు పల్లెల్లో చేపల లభ్యత భారీగా పెరిగింది.

ఉదాహరణకు మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌ గ్రామం వద్ద గల హేమసముద్రం చెరువులో ఒకప్పుడు నీరే ఉండేది కాదు. ఇక చేపలంటే గగనమే. గతేడాది కురిసిన వర్షాలకు ఈ చెరువులో నీరు రావడంతో గ్రామ మత్స్య సహకార సంఘం సభ్యులు చేపపిల్లలను వదిలారు. ఈ ఏడాది వర్షాలకు చెరువు నిండటంతో అలుగుపారి చుట్టుపక్కల గ్రామాలకు సైతం నీరు వెళుతోంది. హేమసముద్రం వెనుకవైపున, అలుగు నీరు కిందకు వెళ్లే ప్రాంతంలోని పల్లెలు, తండాల వాసులు పుష్కలంగా చేపలు పట్టుకుని మహబూబ్‌నగర్‌ పట్టణానికి సైతం తెచ్చి అమ్ముకుంటున్నారు. గతంలో చేపలు తినడానికి సైతం దొరికేవి కావని, ఇప్పుడు తాము పుష్కలంగా తినడమే కాకుండా అమ్ముకుని ఉపాధి పొందుతున్నామని చుట్టుపక్కల పల్లెల ప్రజలు తెలిపారు.

ఆదాయం రెట్టింపు పైనే

గత నాలుగేళ్లలోనూ మత్స్యసంపదపై వచ్చే ఆదాయం ఏకంగా రెట్టింపు కన్నా ఎక్కువ (107 శాతం) అయినట్లు రాష్ట్ర మత్స్యశాఖ అధ్యయనంలో గుర్తించారు. నీటి వనరుల్లో చేపపిల్లలను వదిలే కార్యక్రమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో భారీగా ఆదాయం వస్తోంది. నాలుగేళ్ల క్రితం తొలిసారి 2016-17లో చేపలు, రొయ్యలపై రూ.2,252 కోట్ల ఆదాయం రాగా గతేడాది (2019-20)లో 107 శాతం పెరిగి మొత్తం రూ.4,670 కోట్లకు చేరింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ నాలుగేళ్లలో ఇంత భారీగా పెరుగుదల శాతం నమోదు కాలేదని మత్స్యశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఈ ఏడాది 81 కోట్ల చేప పిల్లలను నీటివనరుల్లో వదిలే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

ఏడాది పొడవునా పెంచాలి..

వానాకాలం నీటి లభ్యత ఉన్నప్పుడే కాకుండా ఏడాది పొడవునా చేపలు, రొయ్యల పెంపకం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏడాదంతా నీరుండే కాళేశ్వరం, శ్రీశైలం, సాగర్‌ వంటి రిజర్వాయర్లు, చెరువుల్లో భారీగా చేపలు పెంచుతోంది. తెలంగాణలో ఏటా జనవరి నుంచి జూన్‌ దాకా గరిష్ఠంగా చేపల ఉత్పత్తి, అమ్మకాలుంటాయి. ఈ సమయంలో రాష్ట్ర ఉత్పత్తిలో 60 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. జులై నుంచి డిసెంబరు దాకా ఇక్కడ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి భారీగా చేపలు వస్తున్నాయి.

వార్షిక వినియోగం తక్కువే

  • రాష్ట్రంలో చేపల తలసరి వార్షిక వినియోగం 7.9 కిలోలే ఉంది. అదే అండమాన్‌లో 61, కేరళలో 45, పశ్చిమబెంగాల్లో 25 కిలోల చొప్పున వినియోగం ఉంది. రాష్ట్రంలో కూడా వినియోగం పెరిగితే వ్యాపారం నాలుగు రెట్లు పెరుగుతుందని రాష్ట్ర మత్స్యశాఖ అంచనా.
  • తెలంగాణ రాష్ట్ర చేపగా ‘కొరమీను’ను గుర్తించారు. థాయ్‌లాండ్‌, వియత్నాంలో కొరమీను పెంపకంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఇక్కడ కూడా పెద్దయెత్తున పెంపకం చేపట్టాలని మత్స్యశాఖ ప్రతిపాదించింది.

ఆదాయానికి అపార అవకాశాలు

మంచినీటి వనరుల్లో పెరిగే కొన్నిరకాల చేపలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. అలాంటి వాటిని తెలంగాణలో ఎక్కువగా పెంచాలన్న ఉద్దేశంతో సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల మండలి (ఎంపీఈడీఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలో ఈ మండలి పనిచేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం కొచ్చిన్‌లో ఉంది. ఈ మండలి సహకారంతో తెలంగాణ నుంచి విదేశాలకు మత్స్యసంపద ఎగుమతులు భారీగా పెంచడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రైవేటు పరిశ్రమల వారిని కూడా మత్స్యసంపద అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గతేడాది 6 టన్నుల చేపలు, రొయ్యలను ఎగుమతి చేశారు. దీనిని మరింత పెంచాలని భావిస్తున్నారు. మత్స్యసంపదతో రూ.వేల కోట్ల ఆదాయానికి అపార అవకాశాలున్నాయని, అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు చేపడుతోందని మత్స్యశాఖ కమిషనర్‌, ముఖ్యకార్యదర్శి అనితారాజేంద్ర అన్నారు.

రాష్ట్రంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి తీరు(టన్నుల్లో)

సంవత్సరంచేపలురొయ్యలు

విలువ

రూ.కోట్లు

2016-171,93,7325,1892,252
2017-182,62,2527,7833,617
2018-192,84,2119,9984,014
2019-202,99,86910,5434,670

ఇవీ చూడండి: కుదేలైన ఆర్థిక వ్యవస్థ... భారీగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.