ETV Bharat / state

క్యూఎస్-2021 ర్యాంకుల్లో హైదరాబాద్​ యూనివర్సిటీలు

author img

By

Published : Jun 11, 2020, 6:43 AM IST

ప్రముఖ పరిశోధనా సంస్థ క్వాక్వారెల్లీ సైమండ్స్ (క్యూఎస్) ప్రతి ఏటా ప్రపంచ ర్యాంకులను ప్రకటిస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన ర్యాంకుల్లో హైదరాబాద్‌ ఐఐటీ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకున్నాయి.

Hyderabad iit and central universities got place in qs rankings 2021
క్యూఎస్-2021 ర్యాంకుల్లో హైదరాబాద్​ యూనివర్సిటీలు

క్యూఎస్‌ టాప్‌ యూనివర్సిటీస్‌-2021 ర్యాంకుల్లో హైదరాబాద్‌ ఐఐటీ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకున్నాయి. ప్రముఖ పరిశోధన సంస్థ క్వాక్వారెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) ఏటా ప్రపంచ ర్యాంకులను ప్రకటిస్తోంది.

లండన్‌లో ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఐఐటీ బాంబే (172), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (185), ఐఐటీ దిల్లీ (193).. భారత్‌ నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. వీటికి మాత్రమే 200లోపు ర్యాంకులు దక్కాయి. ఇక హైదరాబాద్‌ ఐఐటీ 601-650 ర్యాంకు సాధించి దేశంలో టాప్‌-10 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచింది. గత ఏడాది టాప్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌ ఐఐటీ లేదు.

గత ఏడాది 601-650 ర్యాంకుతో పదో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఈసారి 651-700 ర్యాంకుతో 14వ స్థానానికి పడిపోయింది. అయితే హెచ్‌సీయూ వరుసగా నాలుగోసారి క్యూఎస్‌ ర్యాంకుల్లో చోటు దక్కించుకుంది. 2018లో 601-650, 2019లో 591-600, 2020లో 601-650 ర్యాంకులు ఈ వర్సిటీ సొంతమయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఈ ఏడాది ర్యాంకింగ్‌లో చోటు దక్కలేదు.

1000లోపు 21 భారత్‌ విద్యాసంస్థలు

భారత్‌ నుంచి మొత్తం 21 విద్యాసంస్థలు మాత్రమే ప్రపంచంలో వెయ్యిలోపు ర్యాంకుల్లో నిలిచాయి. వీటిలోనూ 14 సంస్థల ర్యాంకులు పడిపోవడం గమనార్హం. గత ఏడాది 24 విద్యాసంస్థలు ఈ ర్యాంకులు దక్కించుకున్నాయి. గత ఏడాది భారత్‌ నుంచి ర్యాంకుల్లో నిలిచిన థాపర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌) ఈసారి ర్యాంకుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. బాంబే, దిల్లీ ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ గత ఏడాది కంటే తక్కువ ర్యాంకులు పొందాయి.

బోధన సామర్థ్యం మెరుగుపడాలి

ఉన్నత విద్యలో బోధన సామర్థ్యం మెరుగుదలకు భారత్‌ ప్రయత్నించాలని, ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని క్యూఎస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చి బెన్‌ సౌటర్‌ పేర్కొన్నారు. పర్యాటక రంగంలోలా భారత్‌ విద్యారంగం ప్రత్యేకతల గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌ వి.రామ్‌గోపాల్‌రావు తెలిపారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.