ETV Bharat / state

TELUGU AKADEMI FD SCAM: తెలుగు అకాడమీ నిధుల పంపిణీలో ఇంకా ఎవరైనా ఉన్నారా..?

author img

By

Published : Oct 11, 2021, 3:22 PM IST

తెలుగు అకాడమీ నిధులు కొల్లగొట్టిన కేసులో హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం నగదును ఎలా పంచుకున్నది. ఇంకా ఎవరెవరి హస్తం ఉన్నది కూపీ లాగుతున్నారు.

TELUGU AKADEMI FD SCAM
TELUGU AKADEMI FD SCAM

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్​మాల్​ కేసులో (TELUGU AKADEMI FD SCAM)ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్​ పోలీసులు.. వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ స్కాంలో మొత్తం రూ.64.5 కోట్లను వాటాలుగా పంచుకున్న వైనంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న కృష్ణారెడ్డి, యోహాన్‌రాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మొత్తం 14 మంది అరెస్ట్​..

నిధులు గోల్​మాల్​ కేసులో (TELUGU AKADEMI FD SCAM)రెండు రోజుల క్రితం ముగ్గురిని సీసీఎస్​ పోలీసులు (HYDERABAD CCS POLICE) అరెస్ట్​ చేశారు. భూపతి, రమణారెడ్డి, సురభి వినయ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల్లో సురభి వినయ్‌.. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డికి పీఏగా పనిచేశారు. రమణారెడ్డి ‌ప్రధాన నిందితుడు సాయికి అనుచరుడిగా ఉన్నారు. అరెస్ట్‌ చేసిన వారిలో భూపతికి ఎఫ్​డీఐల నకిలీ పత్రాలతో సంబంధముందని సీసీఎస్​ పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు తెలుగు అకాడమీ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది.

ఈ స్కాంలో ఒక వైపు సీసీఎస్​ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగానే.. ఈడీ సైతం (ED INVESTIGATION IN TELUGU AKADEMI FD SCAM) రంగంలోకి దిగింది. కోట్ల రూపాయల డిపాజిట్ల మళ్లింపు కేసులో దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్​ చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

రిమాండ్​ రిపోర్టులో ఏముందంటే..

తెలుగు అకాడమీ ఖాతాల నుంచి (TELUGU AKADEMI FD SCAM)జనవరి నుంచే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముఠా సభ్యులు మళ్లించారు. యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ సాయంతో ముఠా అక్రమాలు జరిగాయి. ఎఫ్‌డీలను అగ్రసేన్‌ బ్యాంకులోని ఏపీ మర్చంటైల్‌ సొసైటీకి మళ్లించగా... కెనరా బ్యాంకులోని రూ.10 కోట్ల డిపాజిట్లనూ మళ్లించారు. అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లను కొల్లగొట్టిన నిందితులు... వాటితో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తెలుగు అకాడమీ నిధులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయించి రూ.64.5 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని ఎప్పుడు, ఎలా సొంతానికి వాడుకున్నారన్న అంశాలను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు సేకరించారు. గోల్‌మాల్‌ సూత్రధారి సాయికుమార్‌ రూ.20 కోట్లు తీసుకోగా... ఏపీ మర్కంటైల్‌ సహకార క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్‌ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్‌ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ నుంచి తక్కువ ధరకే డీజిల్‌ ఇప్పిస్తానంటే ఓ డీలర్‌కు రూ.5 కోట్లు ఇచ్చానని, అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్టు సమాచారం. కమీషన్లు తీసుకొని ఆ సొమ్ముతో ఫ్లాట్లు కొన్నామని, కొంత నగదు ఉందని వెనక్కి ఇచ్చేస్తామని యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధన చెప్పినట్లు తెలిసింది. తాను సత్తుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నానని ఇందుకోసం డబ్బు వాడేశానని మరో నిందితుడు డాక్టర్‌ వెంకట్‌ చెప్పినట్టు తెలిసింది. కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధన భర్త బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయని సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) అవినాష్‌ మహంతి చెప్పారు. డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేస్తామని ఈడీ స్పష్టం చేసింది.

ఇలా వెలుగులోకి వచ్చింది..

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu Academy Case).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్‌ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో .. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతో పాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు. నిగ్గు తేల్చాలని అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీచూడండి: TELUGU ACADEMY FD SCAM : తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్​దే కీలకపాత్ర..: సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.