ETV Bharat / state

ఆ కేసులో పోలీసు అధికారులకు ఊరట.. స్టే విధించిన హైకోర్టు

author img

By

Published : Jun 9, 2022, 5:37 PM IST

Telangana High Court: కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు ఊరట లభించింది. సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్షపై హైకోర్టు సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. ఇటీవల నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించింది.

contempt of court case
స్టే విధించిన హైకోర్టు

Telangana High Court: కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసు అధికారులకు సింగిల్‌ జడ్జి విధించిన జైలుశిక్షపై సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని సింగిల్‌ జడ్జి నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించారు. ఓ కేసు దర్యాప్తులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించినందున నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పు వెలువరించారు. హైదరాబాద్‌ జాయింట్‌ సీపీ (అప్పటి వెస్ట్‌జోన్‌ డీసీపీ) ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, బంజారాహిల్స్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ సీఐ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌.నరేశ్..​ సీజే ధర్మాసనం ఎదుట అప్పీల్‌ చేశారు. తాజాగా సింగిల్‌ జడ్జి విధించిన జైలు శిక్షపై సీజే ధర్మాసనం స్టే ఇచ్చింది. విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

అసలేం ఏం జరిగిందంటే?: భార్యాభర్తల వివాదంలో దురుద్దేశపూరితంగా వ్యవహరించడంతో పాటు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పోలీసు అధికారులపై జక్కా వినోద్‌కుమార్‌రెడ్డి, తల్లి సౌజన్యారెడ్డిలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్నేశ్​కుమార్‌ వర్సెస్‌ బిహార్‌ కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది దిల్జీత్‌సింగ్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లపై ఒక కేసు ఉండగానే భార్య సుమన తప్పుడు సమాచారంతో మరో రెండు కేసులు పెట్టారని.. వీటి ఎఫ్‌ఐఆర్‌లను కూడా రహస్యంగా ఉంచారన్నారు. పిటిషనర్ల ఆచూకీ గురించి తెలిసినప్పటికీ పరారీలో ఉన్నారని కింది కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌తో పాటు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారన్నారు.

పిటిషనర్‌ తన కుమార్తె బ్యాడ్మింటన్‌ శిక్షణ నిమిత్తం థాయ్‌లాండ్‌కు వెళ్లారన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు, మెయిళ్లు, లేఖలు రాసినా స్పందించలేదని, విచారణలో పాల్గొనే అవకాశం కల్పించకుండా ఒక కేసులో అభియోగ పత్రం దాఖలు చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల వినతి పత్రాలను, మెయిళ్లను పోలీసులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకుండా సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించారన్నారు. అందువల్ల కోర్టు ధిక్కరణ కింద పోలీసులకు 4 వారాల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానాను 4 వారాల్లో చెల్లించాలని ఆదేశించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు.

ఇవీ చదవండి:

'రాష్ట్రంలో గవర్నర్​ పాలన పెడితే బాగుంటుంది'.. రేవంత్​ ఆసక్తికర వ్యాఖ్యలు

చేయి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం పక్కా.. భర్త బాధితురాలికి సీఎం భరోసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.