హరీశ్​ మర్డర్​ కేసు.. యువతి సోదరుడు సహా 10 మంది అరెస్టు

author img

By

Published : Mar 6, 2023, 7:37 AM IST

హరీశ్

Harish murder case update : హైదరాబాద్‌ శివారులో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యువతి సోదరుడే ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. సోదరిని ప్రేమించడం వల్లే దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. అతనికి సహకరించిన వారిని కటాకటాల వెనక్కి నెట్టారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.

Harish murder case update: హైదరాబాద్‌ శివారు దూలపల్లిలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసును రోజుల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. పక్కా ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేశారు. కేసులో ప్రేమించిన యువతి సోదరుడు దీన్‌దయాల్ ప్రధాన నిందితుడని తేలింది. హరీశ్ బావమరిదితో పాటు అతనికి సహకరించిన మరో పది మందిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న బ్యాండ్‌ వెంకట్‌ అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని చెప్పారు.

గతంలో హరీశ్‌ అమీర్‌పేట్‌లోని ఎల్లారెడ్డిగూడెంలో ఉంటున్నప్పుడు జియాగూడకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో తన చెల్లి వెంటపడొద్దని యువతి సోదరుడు హరీశ్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరీశ్‌.. ఎనిమిది నెలల క్రితం సూరారం ప్రాంతానికి నివాసం మార్చాడు. అక్కడే స్థలం కొనుగోలు చేసి తల్లితో కలిసి అదే ప్రాంతంలో అద్దెకి ఉంటూ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు.

హరీశ్​తో గొడవపడిన యువతి సోదరుడు: హత్య జరగడానికి ఆరు నెలల ముందు హరీశ్​తో యువతి సోదరుడు దీన్​దయాల్​ గొడవ పడ్డాడు. మరోసారి తన చెల్లి జోలికి రావద్దని, కలవకూడదని హెచ్చరించాడు. ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా హరీశ్​, యువతి కలిసే వారు. వీరు కలిసే విషయం తాను ప్రేమించిన యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు సైతం హరీశ్​ను బెదిరించారు.

ఇటీవల తిరిగి ఇద్దరు కలుసుకున్నారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు హరీశ్ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో యువతి కనిపించడం లేదంటూ ఆమె బంధువులు హరీశ్‌కు ఫోన్‌ చేశారు. గత శుక్రవారం సూరారం ప్రాంతంలో హరీశ్‌ ఫొటోతో రెక్కీ నిర్వహించిన తర్వాత.. యువతి సోదరుడు దీన్‌దయాల్‌తో పాటు అతని స్నేహితులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తులతో దారుణంగా నరికి చంపి వెళ్లిపోయారు.

సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలతో పాటు ఎవరెవరు చంపారనే అంశంపై నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుడిని దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని, తమకు సరైన న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.

హరీశ్ హత్య కేసులో యువతి సోదరుడే ప్రధాన నిందితుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.