ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​న్యూస్.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

author img

By

Published : Nov 23, 2022, 7:22 AM IST

Group-4 Recruitment in Telangana: గ్రూప్-4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా.. గ్రూప్-2, 3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో 1298 పోస్టులు మంజూరు చేసిన అనంతరం.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతులు ఇవ్వనుంది.

Group-4 Recruitment in Telangana
Govt permission to fill Group4 posts

గ్రూప్-4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం.. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి

Group-4 Recruitment in Telangana: రాష్ట్రంలో 80వేల 39 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. వాటిలో గ్రూప్-1 సహా వివిధ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. కొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉండగా, మరికొన్ని పోస్టులకు సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. మొత్తం 80 వేలకుపైగా ఉద్యోగాలకుగాను ఆర్థికశాఖ ఇప్పటివరకు 52 వేలకుపైగా పోస్టుల భర్తీకి పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఆయా ఉద్యోగాల భర్తీని నియామక సంస్థలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అందుకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగ నియామకాల ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. కీలకమైన గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రారంభించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయింది. ప్రాథమిక కీ, అభ్యంతరాల స్వీకరణ, అనంతరం తుది కీ ప్రకటన అయిపోయింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి జాబితాను టీఎస్​పీఎస్​సీ ప్రకటించాల్సి ఉంది.

ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహించాలన్న ఆలోచనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదట ఉండేది. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన అంశాలు దృష్టిలో ఉంచుకొని మెయిన్స్ తేదీని ఖరారు చేయనున్నారు. గ్రూప్-2, 3 పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా టీఎస్​పీఎస్​సీప్రారంభించాల్సి ఉంది. 663 గ్రూప్-2, 1373 గ్రూప్-3 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. గ్రూప్-1 షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు.

త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ వస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఇటీవల ప్రకటించారు. గ్రూప్-4 కేటగిరీలో 9168 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. 9168 పోస్టుల్లో కొన్ని కొత్త పోస్టులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాల్లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది.

ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖలో 1298 కొత్త పోస్టులకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆమోదం లభించిన వెంటనే కొత్త పోస్టులను మంజూరు చేయనున్నారు. అనంతరం గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వనుంది. సర్కార్ అనుమతి తర్వాత ఆయా శాఖల నుంచి అవసరమైన వివరాలను తీసుకొని గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష, ఫలితాలతో పాటు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీ షెడ్యూల్ ను పరిగణలోకి తీసుకొని గ్రూప్-4 నియామక షెడ్యూల్ ప్రకటిస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.