ETV Bharat / state

మార్చి 14 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్

author img

By

Published : Feb 11, 2021, 4:18 PM IST

Updated : Feb 11, 2021, 5:38 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

mlc
mlc

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం-వరంగల్‌, నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 14 న రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది. నామినేషన్లకు ఫిబ్రవరి 23 గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువుగా నిర్ణయించారు. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 22వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తికానుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈనెల 13 వరకు గడువు

రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటుహక్కు నమోదు కోసం ఈ నెల 13వ తేదీ వరకు గడువుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. షెడ్యూల్ విడుదలతో రెండు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి వ్యయ పరిమితి లేదని సీఈఓ చెప్పారు. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 5,21,386 మంది ఓటర్లు ఉండగా... 616 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వరంగల్- నల్గొండ-ఖమ్మం నియోజకవర్గంలో 4,92,943 మంది ఓటర్లకు... 546 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో వెయ్యి మందికి పైగా ఓటర్లు ఉన్న 365 పోలింగ్ కేంద్రాలకు అనుబంధ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని శశాంక్ గోయల్ తెలిపారు.

పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు చర్యలు

ఖమ్మం-వరంగల్‌, నల్గొండ జిల్లాల ఎన్నికలకు ప్రెసైడింగ్​ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్​ వ్యవహరిస్తారని తెలిపారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌ ప్రాంతాలకు జీహెచ్​ఎసీ అడిషనల్​ కమిషనర్​ వ్యవరిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు కనుక ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు సెలవుదినం రోజున పోలింగ్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించిన ఎన్నికల కసరత్తు జరుగుతోందన్న ఆయన... ఈసీ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉందన్నారు.

షెడ్యూలు వివరాలు

నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 23
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 26
నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 24
పోలింగ్ మార్చి 14
ఓట్ల లెక్కింపు మార్చి మార్చి 17
మార్చి 14 న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్

ప్రచారంలో అభ్యర్థులు...

‍‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు సవాలుగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలోకి దిగారు. అధికార తెరాసతో పాటు భాజపా ఎమ్మెల్సీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈసారైనా సత్తా చాటి రాష్ట్రంలో బలం నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం-వరంగల్‌, నల్గొండ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాములునాయక్‌ పేరును ప్రకటించింది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానానికి చిన్నారెడ్డి పేరును ఖారారు చేసింది. తెరాస నుంచి ఖమ్మం-వరంగల్‌, నల్గొండ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ఆ పార్టీ దాదాపు నిర్ణయించింది. అదే స్థానం నుంచి తెలంగాణ జనసమితి అభ్యర్థిగా కోదండరామ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. భాజపా నుంచి ప్రేమేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్‌ పీఠం

Last Updated : Feb 11, 2021, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.