ETV Bharat / state

Governor Vs Government: 'ప్రభుత్వ వివరణ హాస్యాస్పదంగా ఉంది'

author img

By

Published : Mar 6, 2022, 5:33 AM IST

Updated : Mar 6, 2022, 10:20 AM IST

Governor
Governor

Governor Vs Government: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం మరోమారు చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణను స్వయంగా తప్పుపట్టిన గవర్నర్ తమిళిసై... హాస్యాస్పదంగా ఉందంటూ అభివర్ణించారు. రాజ్యాంగపరంగా తనకు అధికారం ఉన్నప్పటికీ... ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌కు అనుమతిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని అంటున్న తెరాస వర్గాలు... కౌశిక్ రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ తదితర ఉదంతాలను ఉదహరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల‌తో ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి, రాజ్యాంగ బ‌ద్దంగా న‌డుచుకునే వైఖరి గ‌వ‌ర్నర్లకు ముఖ్యమని తెరాస వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Governor Vs Government: 'ప్రభుత్వ వివరణ హాస్యాస్పదంగా ఉంది'

Governor Vs Government: రేపట్నుంచి ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం లేకపోవడం మరోమారు చర్చకు దారితీసింది. శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టేందుకు అనుమతిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సుధీర్ఘ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. సంప్రదాయం ప్రకారం ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తన విజ్ఞతతో బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందన్న తమిళిసై... కొత్త సెషన్ కానందున సాంకేతిక అంశాల కారణంగా గవర్నర్ ప్రసంగం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొందన్నారు. ఐదు నెలల విరామం తర్వాత సభ సమావేశమవుతోందని.. సాధారణ పరిస్థితుల్లో ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభ సమావేశమైనప్పుడు, కొత్త సెషన్ కోసం సభను ఏర్పాటు చేస్తారని గవర్నర్ వ్యాఖ్యానించారు.

ప్రసంగం రాజ్​భవన్​ తయారు చేయదు...

సుదీర్ఘ విరామం ఉన్నప్పటికీ, ప్రభుత్వం మునుపటి సెషన్‌ను కొనసాగించాలని నిర్ణయించిందని... సాంకేతిక కారణాలతో సంప్రదాయంగా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని రాజ్​భవన్ తయారు చేయదని, అది ప్రభుత్వ ప్రకటన అని తమిళిసై స్పష్టం చేశారు. గతేడాదిగా ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలు, తదుపరి సంవత్సరానికి సంబంధించిన విధాన సూచికల నివేదిక కార్డు గవర్నర్ ప్రసంగమని వివరించారు. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న విషయాల ఆధారంగా సభలో అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుందన్నారు. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయని ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు తన అనుమతి కోరినప్పుడు ప్రభుత్వం తెలిపిందని తమిళిసై గుర్తు చేశారు. తదుపరి వివరణలో... దురదృష్టవశాత్తు అది అనుకోకుండా జరిగిందని ప్రభుత్వం పేర్కొందన్నారు. అనుకోకుండా నోట్ వచ్చిందని ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని గవర్నర్ ఆక్షేపించారు.

ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని...

ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేసినట్లు గవర్నర్ తెలిపారు. సిఫార్సుకు సమయం తీసుకునేందుకు తనకు ఇంకా స్వేచ్ఛ ఉన్నప్పటికీ... ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా అనుమతించినట్లు వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని తమిళిసై అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని అధికారాలు ఇచ్చినప్పటికీ ప్రజా సంక్షేమం దృష్ట్యా అసెంబ్లీలో బడ్జెట్‌ పెట్టేందుకు అనుమతించినట్లు తెలిపారు.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే...

గవర్నర్ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి. ఈఎస్‌ఎల్ న‌ర‌సింహ‌న్ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో విభేదించినప్పటికీ... ముఖ్యమంత్రి అయ్యాక ఇద్దరి మ‌ధ్య స‌ఖ్యత ఉండేదని గుర్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గ‌వ‌ర్నర్ వ్యవ‌స్థకు త‌గిన గౌర‌వం ఇచ్చారని, రెండు వ్యవ‌స్థల మ‌ద్య ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోవడానికి ప‌లు కార‌ణాలున్నాయని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రివ‌ర్గం చేసిన సిఫార్సుల‌ను గ‌వ‌ర్నర్ ఆమోదించ‌లేదని, అలా అని తిర‌స్కరించ‌కుండా చాలా రోజులు పెండింగ్‌లో పెట్టారని చెప్తున్నారు. ఉద్దేశ‌పూర్వకంగా ప్రభుత్వ సిఫార్సును పెండింగ్‌లో పెట్టారనే అభిప్రాయం ఉందని ఆరోపిస్తున్నారు.

నాన్చివేత ధోరణి...

శాస‌న‌మండ‌లికి ప్రొటెం ఛైర్మన్‌గా ఎంఐఎం స‌భ్యులు, సీనియ‌ర్ జ‌ర్నలిస్టు అమీనుల్ జాఫ్రీని ప్రభుత్వం సిఫారసు చేశాక గ‌వ‌ర్నర్ నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోర‌ణితో వ్యవ‌హ‌రించారని చెబుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి దృష్ట్యా జనవరి 26న బ‌హిరంగ స‌భ లేదు కాబ‌ట్టి ప్రసంగాలు వ‌ద్దనుకున్నారని...గ‌వ‌ర్నర్ అనూహ్యంగా గణతంత్ర దినోత్సవాన ప్రసంగించారని అంటున్నారు. 2021-2022 గ‌వ‌ర్నర్ బ‌డ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర మంత్రిమండ‌లి ఆమోదించ‌ని కొన్ని పేరాల‌ను తమిళిసై సొంతంగా చ‌దివారని, ఆ అంశాన్ని ప్రభుత్వం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించ‌లేదని చెప్తున్నారు. దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో గ‌వ‌ర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాల‌కు మ‌ధ్య ఘ‌ర్షణాత్మక వైఖ‌రి త‌లెత్తిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయని... రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి, రాజ్యాంగ బ‌ద్దంగా న‌డుచుకునే ధోర‌ణి ముఖ్యమని తెరాస వర్గాలు అంటున్నాయి.

గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాల నిర్వహణపై తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వివరణతో ఈ అంశం ఇంత దూరం వచ్చినట్లు చెప్తున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌కు సుధీర్ఘ లేఖ రాసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:

Last Updated :Mar 6, 2022, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.