ETV Bharat / state

నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు - మా పాలన దేశానికే ఆదర్శం కాబోతుంది : గవర్నర్ తమిళిసై

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 1:09 PM IST

Updated : Dec 15, 2023, 1:46 PM IST

Governor Tamilisai Soundara Rajan
Governor Tamilisai Soundara Rajan

Governor Tamilisai Soundara Rajan Speech in Assembly : ఇది ప్రజా ప్రభుత్వమని, తమది ప్రజల పాలన అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. ఇది సామాన్యుడి సర్కార్‌ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని తెలిపారు. తమ పాలన దేశానికే ఆదర్శం కాబోతుందని, అమరవీరుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని పాలన సాగిస్తామని తమిళిసై వెల్లడించారు.

Governor Tamilisai Soundara Rajan Speech in Assembly : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundara Rajan) ప్రసంగించారు. పద్మ విభూషణ్ కాళోజీ పలుకులతో గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. నూతన సర్కార్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. ప్రజా సేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి సభా వేదికగా నివాళి అర్పిస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.

టీఎస్​పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ : సీఎం రేవంత్​ రెడ్డి

జీవితాల్లో గొప్ప మార్పులు రావాలని ప్రజలు ఆశించారని తమిళిసై సౌందర రాజన్‌ తెలిపారు. మార్పు కోసం వారు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు, పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అని చెప్పారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలిగాయని అన్నారు. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వం వచ్చిందని వివరించారు. ఎన్నో ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు.

అసైన్డ్‌ పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ

"రైతులు, యువత, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాం. అభివృద్ధిలో రాష్ట్రం మరింత దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు, ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇండ్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా మారుస్తాం." - తమిళిసై సౌందర రాజన్, గవర్నర్

'గత ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేసింది. అప్పులపై శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. తెలంగాణ సర్కార్ అప్పులపై ప్రజలకు వాస్తవాలు చెబుతాం. హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై సీఎం తొలి సంతకం చేశారు. తొలి అడుగులోనే సంక్షేమానికి మా ప్రభుత్వం నాంది పలికింది. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే రెండు గ్యారెంటీలు అమలు చేశాం' అని తమిళిసై పేర్కొన్నారు.

వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు కార్యాచరణ

మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ప్రతి ఆడబిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల (Six Guarantees) అమలుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రజల ఆరోగ్య భద్రతకు తమ సర్కార్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రస్తుత అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దామని, ఆ పరిధిని రూ.10 లక్షలకు పెంచినట్లు తమిళిసై సౌందర రాజన్ గుర్తుచేశారు.

కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం

"ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన అన్ని డిక్లరేషన్లు అమలు చేస్తాం. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలం, గౌరవభృతి ఇస్తాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. అసైన్డ్‌, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ చేస్తాం. కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నాం." - తమిళిసై సౌందర రాజన్, గవర్నర్

యువతకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru Rangareddy Project )జాతీయ హోదా సాధించాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్లను పూర్తి చేసి ఎగువ ప్రాంతాలకు నీళ్లు అందించనున్నట్లు, తద్వారా ఆదిలాబాద్‌, ఇతర జిల్లాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. యువతకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చనున్నట్లు తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక - సభ్యుల అభినందనలు

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటు - గెజిట్ నోటిఫికేషన్ జారీ

Last Updated :Dec 15, 2023, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.