e voting: మీ దగ్గర స్మార్ట్​ఫోన్​ ఉందా..? అయితే ఇక పోలింగ్​ కేంద్రానికి వెళ్లక్కరలేదు

author img

By

Published : Oct 6, 2021, 9:57 PM IST

smart e voting
smart e voting ()

స్మార్ట్ ఫోన్ ఆధారిత ఈ-వోటింగ్ (e voting) విధానంపై డ్రైరన్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఐటీ అండ్ సీ విభాగం, సీడాక్ కలిసి రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ ఎలక్షన్ విధానం ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఈ విధానానికి సంబంధించిన డ్రై రన్​ను... డమ్మీ ఎలక్షన్ నిర్వహించటం ద్వారా పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాను పైలెట్​గా ఎంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో పరీక్షించి.. ఈవోటింగ్ విధానంలో సవాళ్లను, సమస్యలను గుర్తించనుంది.

కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని డిజిటల్ మార్గాలవైపు దారిమరల్చింది. అన్ని పనులను ఆన్​లైన్​లో చక్కబెట్టే మనం.. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఎన్నికల్లో సైతం మొబైల్​ ద్వారా ఓటింగ్ వేసే పద్ధతిని(e voting) త్వరలోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఐటీఅండ్ సీ విభాగం, సీడాక్ కలిసి సంయుక్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ఎలక్షన్ విధానాన్ని రూపొందించాయి. ఐఐటీ బిలాయి డైరెక్టర్ రాజత్ మూనా అధ్యక్షతన నిపుణుల కమిటీ మార్గదర్శకంలో ఈ ప్రాజెక్టును పరీక్షిస్తున్నారు.

మొదటగా వారికే అవకాశం

మొదటగా ఈ-వోటింగ్ విధానాన్ని కొన్ని గ్రూపుల ప్రజల కొరకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ప్రాజెక్టుకు అంకురార్పన చేసింది. ఇందులో ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, పోలింగ్ సిబ్బంది, ఐటీ ఉద్యోగులు, నోటిఫైడ్ ఎసన్షియల్ సర్వీసు ఉద్యోగులకు ఈ విధానంలో ఓటుహక్కు కల్పించనున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగంతో, సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్​డ్ కంప్యూటింగ్ -సీడాక్​తో జతకట్టింది.

ఖమ్మం జిల్లాలో పైలట్​ ప్రాజెక్ట్​గా..

మొబైల్​ ఆధారంగా ఈ-వోటింగ్ చేసే సాంకేతికత అభివృద్ధి ఇప్పటికే పూర్తవగా.. ఇందుకు సంబంధించిన డ్రైరన్​ను ఒక డమ్మీ ఎలక్షన్ నిర్వహించటం ద్వారా పరీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం జిల్లాను పైలెట్​గా ఎంచుకొని అక్టోబర్ 8 నుంచి 18 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. అక్టోబర్ 20న డమ్మీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ డ్రైరన్​లో పాల్గొనేందుకు జిల్లాలోని అందరు పౌరులకు అవకాశం ఇవ్వనున్నారు.

తెలుగు, ఇంగ్లీషు భాషల్లో

ఈ-వోటింగ్ విధానంలో కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను వినియోగించనున్నారు. ఈ సాంకేతికతల సాయంతో మూడు సార్లు ఓటరు అథెంటిఫికేషన్ చేయనున్నారు. ఓటరు పేరు, ఆధార్, లైవ్ లొకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ వంటివి సరిచూడనున్నారు. బ్లాక్​చైన్ టెక్నాలజీతో ఆన్​లైన్ ఫార్మెట్​లో వేసిన ఓట్లు చెరిగిపోకుండా దోహదపడి తిరిగి లెక్కించటానికి దోహదపడుతుంది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ డేటా అంతా స్టేట్ డేటా సెంటర్​లో భద్రపరుస్తారు. ఈ స్మార్ట్​ఫోన్ అప్లికేషన్​ను చాలా మినిమలిస్ట్ డిజైన్​తో స్టేట్ ఎలక్షన్ కమిషన్ తయారు చేసింది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ రూపకల్పన ఉంటుంది.

పురోగతికి నిదర్శనం

ప్రభుత్వ పరంగా అనేక ప్రాజెక్టుల్లో కృత్రిమ మేథ, బ్లాక్ చైన్ సాంకేతికత పనిని సులభతరం చేశాయని.. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ప్రశంసించింది. ఈ సాంకేతికత ఆధారంగా ఈ-వోటింగ్ సిస్టంను అభివృద్ధి చేయటం శుభపరిణామమని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ సైతం ఈ సాంకేతికలపై నమ్మకం ఉంచి ఈ రకమైన విధానానికి దారులు తెరవటం దేశం ఈ రంగాల్లో చెందుతోన్న పురోగతికి నిదర్శనమని ఆయన అన్నారు.

ఇదీ చూడండి: Medicine From Sky: డ్రోన్ పేలోడ్​తో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై మరింత సులభతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.