ఇచ్చంపల్లి కేంద్రంగా - గోదావరి కావేరీ అనుసంధానానికి అన్ని రాష్ట్రాల గ్రీన్ సిగ్నల్

ఇచ్చంపల్లి కేంద్రంగా - గోదావరి కావేరీ అనుసంధానానికి అన్ని రాష్ట్రాల గ్రీన్ సిగ్నల్
Godavari Kaveri River Linkage Meeting : గోదావరిలో ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోని నీటిని.. కావేరికి తరలించే ముసాయిదా ఒప్పందంపై అన్ని రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని.. నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ తెలిపారు. ఇవాళ భాగస్వామ్య రాష్ట్రాలతో.. హైదరాబాద్‌లోని జలసౌధలో నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.
Godavari Kaveri River Linkage Meeting : నదుల అనుసంధానంపై చకచకా అడుగులు పడుతున్నాయి. నదుల అనుసంధాన (River Linkage) టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరాం అధ్యక్షతన.. హైదరాబాద్ జలసౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ- ఎన్‌డబ్ల్యూడీఏ, టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా నదుల అసనుసంధాన ప్రాజెక్టులతోపాటు గోదావరి-కావేరి, బెడ్తి-వార్ధా లింక్‌లపై ఆయా రాష్ట్రాలతో వెదిరె శ్రీరాం, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భూపాల్ సింగ్.. ముఖ్య ఇంజనీర్ శంఖ్వా చర్చించారు.
ముసాయిదా ప్రాజెక్టు నివేదికపై అభిప్రాయాలను నమోదుచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఎస్‌ఈ కోటేశ్వరరావు.. ఆన్‌లైన్ ద్వారా. ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ బృందం, ఇతర రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ట్రైబ్యునల్ కేటాయింపులకు ఇబ్బంది లేనంత వరకు గోదావరి జలాల తరలింపునకు ఇబ్బంది లేదని తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు స్పష్టం చేశారు.
Task Force Meeting on River Linking in Hyderabad : గోదావరి-కావేరీ అనుసంధానంలో (Godavari Kaveri River Linkage) ప్రతిపాదించిన నీటి వాటా కంటే ఎక్కువ భాగం కావాలని కోరారు. భూసేకరణ వీలైనంత తక్కువగా ఉండాలన్న తెలంగాణ.. ప్రతిపాదిత ఆనకట్టను ఇచ్చంపల్లి కంటే కాస్త పైన ఉంటే.. సమ్మక్క ఆనకట్టకి బ్యాక్‌వాటర్స్‌తో ఇబ్బంది ఉండబోదని పేర్కొంది. ఎక్కువ వాటా కావాలన్న తెలంగాణ విజ్ఞప్తిని ఎన్‌డబ్ల్యూడీఏ పరిశీలిస్తుందని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరాం తెలిపారు. తొలిదశలో కేవలం 400 హెకార్ల భూసేకరణ మాత్రమే అవసరమని వివరించారు. నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. ఎన్‌డబ్ల్యూడీఏ బృందం ఇచ్చంపల్లి ప్రాంతాన్ని సందర్శించి.. సమ్మక్క ఆనకట్ట బ్యాక్ వాటర్స్ ప్రభావం లేకుండా ఖచ్చితమైన ప్రాంతాన్ని నిర్ధారిస్తారని వెదిరె శ్రీరాం పేర్కొన్నారు.
గోదావరిలో మిగులు జలాలు కాకుండా కేవలం ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని జలాలను మాత్రమే తరలించాలన్న ఆంధ్రప్రదేశ్.. ఇందుకోసం కేంద్ర జలసంఘం అధ్యయనాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. నాగార్జునసాగర్, సోమశిల జలాశయాలు ప్రస్తుత ఆయకట్టుతోపాటు కొత్త అవసరాల తీర్చే అంశంపై ఎన్‌డబ్ల్యూడీఏ (NWDA) అధ్యయనం చేయాలని పేర్కొంది. ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని కోరిన ఏపీ... దిగువ రాష్ట్రంలో తమ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న హామీ కావాలని స్పష్టంచేసింది.
గోదావరి జలాల మళ్లింపునకు ఇచ్చంపల్లికి ప్రత్యామ్నాయంగా పోలవరాన్ని పరిశీలించాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మిగులు జలాలు వినియోగించుకునేది లేదన్న వెదిరె శ్రీరాం (River Linkage Task Force Chairman Vedire Sriram).. సాంకేతిక అంశాలపై ఆంధ్రప్రదేశ్ అధికారులతో ఎన్‌డబ్ల్యూడీఏ విడిగా సమావేశం నిర్వహిస్తుందని తెలిపారు. దిగువ రాష్ట్రంగా ఏపీకి ఉండే హక్కులకు ఏ భంగం కలగబోదని చెప్పారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్‌కు కాల్వ తెలంగాణ అవసరాలకు లోబడి ఉందని వెదిరె శ్రీరాం వివరించారు.
ఇచ్చంపల్లి ప్రతిపాదన కేవలం మొదటి దశ మాత్రమే అని వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. తదుపరి దశల్లో పోలవరం ప్రతిపాదనను పరిశీలిస్తామని వివరించారు. ఒప్పందంపై సంతకం చేసేందుకు తెలంగాణ, ఏపీ సంసిద్ధత వ్యక్తం చేశాయని అన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అంగీకారం తెలిపాయని చెప్పారు. కెన్-బెత్వా, పర్బతి - చంబల్, కోసి - మేచి లింక్ ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చించారు.
"గోదావరి- కావేరి నదుల అనుసంధాన ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదికపై రాష్ట్రాలతో చర్చించాం. ముసాయిదాపై అన్ని రాష్ట్రాలు సుమఖత వ్యక్తం చేశాయి." - వెదిరె శ్రీరాం, నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్
ప్రధానంగా నదుల అనుసంధానంతో ప్రతి సీజన్‌లో వందల టీఎంసీల గోదావరి జలాలు.. సముద్రంలో కలవకుండా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
