ETV Bharat / state

jurala dam: జూన్‌లోనే నిండుగా జూరాల

author img

By

Published : Jun 10, 2021, 6:39 AM IST

ఈ సంవత్సరం జూన్‌ ఆరంభంలోనే జూరాల నిండింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం, నారాయణపూర్‌-జూరాల మధ్యలో కురిసిన వర్షాలతో మంగళవారం రాత్రి నుంచే వరద ప్రవాహం వచ్చింది.

jurala dam
జూన్‌లోనే నిండుగా జూరాల

.

బుధవారం ఉదయం జూరాలకు 27,400 క్యూసెక్కులు రాగా, సాయంత్రం ఆరుగంటలకు 18,800 క్యూసెక్కులకు తగ్గింది. అయినప్పటికీ 9.66 టీఎంసీల సామర్థ్యం గల జూరాలలో అప్పటికే నాలుగున్నర టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఒక రోజులోనే పూర్తిస్థాయి మట్టానికి చేరువైంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 9.214 టీఎంసీల నిల్వ ఉంది. సాధారణంగా జులై నెలాఖరుకు నిండుతూ ఉంటుంది.

ముందుగా ఎందుకు వదిలారో?

నారాయణపూర్‌ రిజర్వాయర్‌లో ఎక్కువ నిల్వ ఉన్నా నిండటానికి ఇంకా 12 టీఎంసీలు అవసరం. అయినా జూన్‌ ఆరంభంలోనే దిగువకు నీటిని విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. నారాయణపూర్‌ దిగువన, జూరాల పైభాగంలో కర్ణాటక గూగుల్‌ బ్యారేజి నిర్మించింది. ఈ బ్యారేజి నుంచి ఎత్తిపోతల ద్వారా వినియోగించుకొనేందుకు నారాయణపూర్‌ నుంచి దిగువకు వదిలారని, మధ్యలో కురిసిన వర్షంతో ఎక్కువ ప్రవాహం రావడంతో జూరాలకు వచ్చిందని కేంద్ర జలసంఘం వర్గాలు పేర్కొంటున్నాయి.

వివరాలిలా...

జల విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు

నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయటంతో జలవిద్యుదుత్పత్తికి తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం ఒక యూనిట్‌ను సర్వీసులోకి తెచ్చారు. ఒక యూనిట్‌ను ఉపయోగించటం ద్వారా ప్రస్తుతానికి 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుందని చెప్పారు. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలానికి 5,157 క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతోపాటు జూరాల కుడి, ఎడమ కాలువలు, నెట్టెంపాడు, భీమా ఒకటి, రెండు ఎత్తిపోతలు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకు నీటిని విడుదల చేశారు. తుంగభద్రలో స్థానికంగా కురిసిన వర్షాలతో కర్నూలు జిల్లాలోని సుంకేశుల నుంచి 3,284 క్యూసెక్కులు వదిలారు. అటు జూరాల, ఇటు సుంకేశుల నుంచి కలిపి 8,441 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి ఉంది. కర్ణాటకలో ఎగువ ప్రాంతాలతో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టిలోకి 16,351 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 11,651 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఈ రిజర్వాయర్‌ ఖాళీగా ఉంది. నిండటానికి 104 టీఎంసీలు అవసరం. దిగువన ఉన్న నారాయణపూర్‌కు 11,345 క్యూసెక్కులు రాగా, 13,511క్యూసెక్కులు దిగువకు వదిలారు.

ఇదీ చదవండి : Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.