ETV Bharat / state

బడికి భద్రతేది... విద్యార్థుల భవితకు బాధ్యతెవరిది?

author img

By

Published : Feb 5, 2021, 9:47 AM IST

దాదాపు ఏడాది కాలంగా బడుల నిర్వహణ లేక విద్యుత్తు వ్యవస్థ ప్రమాదకరంగా మారింది. చాలావరకు పాఠశాలలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవు. అనుమతులు తప్పనిసరి అని చెప్పినా అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. నాలుగైదు అంతస్తులు ఉన్నప్పటికీ కేవలం జీ+1 మాత్రమే ఉన్నట్లు చూపించి మున్సిపాలిటీ నుంచి ధ్రువీకరణ తెచ్చుకుంటున్నారు.

fire-accidents-in-schools-due-to-lack-of-noc-from-electrical-department-in-hyderabad
బడుల్లో ప్రమాదకరంగా విద్యుత్ వ్యవస్థ... అనుమతుల్లో అక్రమాలు!

సైదాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల అయిదంతస్తుల భవనంలో ఉంది. ఇటీవల పునరుద్ధరణ(రెన్యువల్‌) చేసుకునేందుకు విద్యాశాఖకు యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. జీ+5 ఉండటంతో అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ ఉండాలి. విద్యాశాఖలోని సిబ్బందితో కుమ్మక్కై కేవలం జీ+1 ఉన్నట్లుగా చూపించి వేరొక పాఠశాల పత్రాలపై అనుమతులు పొందారు. ఇదొక్కటే కాదు నగరంలో అనేక ప్రైవేటు పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. గురువారం పాతబస్తీ గౌలిపురాలోని శ్రీనివాస హైస్కూల్‌లో జరిగిన ప్రమాదంతో భద్రతపై ఆందోళన నెలకొంది. కనీసం అగ్నిమాపక వాహనం వెళ్లేందుకు వీల్లేని ఇరుకుదారుల్లోని భవనాల్లో పాఠశాలలు కొనసాగుతున్నాయి.

fire-accidents-in-schools-due-to-lack-of-noc-from-electrical-department-in-hyderabad
గురువారం ప్రమాదం జరిగిన గౌలిపురాలోని పాఠశాలలో పొగలు

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో దాదాపు 4500 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2760 వరకు ఉన్నత పాఠశాలలు. ప్రస్తుతం 9, 10 తరగతుల విద్యార్థులకు బోధన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా బడుల నిర్వహణ లేక విద్యుత్తు వ్యవస్థ ప్రమాదకరంగా తయారైంది. నగరంలో చాలావరకు పాఠశాలలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవు. చుట్టూ భవనాల మధ్య ఇరుకు సందుల్లో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

ఏం చేస్తున్నారంటే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలుంటే అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి. 2009లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని ప్రైవేటు యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఆ ఏడాది కంటే ముందు ఏర్పాటుచేసిన పాఠశాలలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ ఇచ్చి అగ్నిమాపక శాఖ నుంచి రెన్యువల్‌ చేయించుకోవచ్చు. ఇదే వారికి వరంగా మారుతోంది. అప్పటికే అనుమతులు తెచ్చుకున్న పాఠశాలతో బేరసారాలు చేస్తున్నారు. లెటర్‌ హెడ్‌పై ఉన్న పాఠశాలల పేర్లు మార్చి అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఎక్కడైనా విద్యాశాఖాధికారులు తనిఖీలకు వెళ్లిన సందర్భంగా నకిలీ పత్రాలు గుర్తిస్తే వారినీ మంచి చేసుకుంటున్నారు. నాలుగైదు అంతస్తులు ఉన్నప్పటికీ కేవలం జీ+1 మాత్రమే ఉన్నట్లు చూపించి మున్సిపాలిటీ నుంచి ధ్రువీకరణ తెచ్చుకుంటున్నారు.

ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేయాలంటే నిబంధనలు..

  • విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గది ఉండాలి. ఉపాధ్యాయులకు ప్రత్యేక గదులు అవసరం.
  • తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల చదరపు మీటర్లు, అర్బన్‌ ప్రాంతాల్లో 1000 చదరపు మీటర్ల ఆటస్థలం ఉండాలి.
  • బాల్కనీలకు ప్రత్యేకంగా గ్రిల్స్‌ అమర్చాలి.
  • అగ్నిమాపక పరికరాలు ఉండాలి.
  • పాఠశాల ఎదురుగా రహదారులపై జీబ్రా క్రాసింగ్స్‌ వేసేందుకు నిధులు యాజమాన్యాలు భరించాలి.
  • భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ స్థానిక సంస్థల నుంచి తీసుకోవాలి.
  • ట్రాఫిక్‌ విభాగం నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి.

ఇదీ చదవండి: నరసింహస్వామి మూలవర్యులకు బంగారు తొడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.