ETV Bharat / state

'తప్పుచేసి తప్పించుకోకుండా.. మరింత పకడ్బందీగా దరఖాస్తుల వడబోత'

author img

By

Published : Apr 30, 2022, 10:51 AM IST

Filtering of applications of candidates in the Police recruitment 2022
'తప్పుచేసి తప్పించుకోకుండా.. మరింత పకడ్బందీగా దరఖాస్తుల వడబోత'

TS Police recruitment 2022 : గతానుభవాలతో పోలీస్‌శాఖ పకడ్బందీగా దరఖాస్తుల వడబోత చేపడుతోంది. బ్యాక్‌లాగ్స్‌ వీలైనంతగా నివారించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్‌ నియామక మండలి ముమ్మర కసరత్తు చేస్తోంది.

TS Police recruitment 2022 : తెలంగాణలో పోలీస్‌ కొలువుల కోలాహలం మరోమారు మొదలైంది. లక్షలాది నిరుద్యోగ యువత పోలీస్‌శాఖలో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వేళ.. ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌పీఆర్‌బీ) ప్రారంభించింది. సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. మే నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు సిద్ధమవుతోంది.

గతానుభవాల దృష్ట్యా దరఖాస్తుల వడబోతను మరింత పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అంతకుముందు నోటిఫికేషన్ల క్రమంలో జరిగిన తప్పిదాలను ఈసారి ముందుగానే నియంత్రించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ధ్రువీకరణపత్రాలను జతచేసే దరఖాస్తుదారులను ఆదిలోనే గుర్తించడంపై దృష్టి సారించనుంది. ఇలాంటి వారితో క్రితంసారి బ్యాక్‌లాగ్స్‌ భారీగా మిగలడంతో ఈసారి సాధ్యమైనంతగా వాటిని నివారించే యోచనతో అధికారులు ఉన్నారు.

‘ఎక్స్‌’ సర్వీస్‌మెన్‌ కోటాకు కొత్త భాష్యం: సాధారణంగా పోలీస్‌ నియామకాల్లో మాజీ సైనికోద్యోగుల(ఎక్స్‌ సర్వీస్‌మెన్‌)కు ప్రత్యేక కోటాతో పాటు సడలింపులుంటాయి. ఈ కోటాలో కొలువులు సాధించేందుకు గతంలో పెద్దఎత్తున తప్పుడు ధ్రువీకరణపత్రాల్ని సృష్టించి దరఖాస్తులకు జత చేశారు. రాష్ట్రంలో ఉన్న మాజీ సైనికోద్యోగులకంటే ఎక్కువగా ఇలా దరఖాస్తులు రావడంతో అధికారులకు అనుమానమొచ్చింది. ఆరా తీస్తే పెద్దఎత్తున తప్పుడు ధ్రువీకరణపత్రాలు బహిర్గతమయ్యాయి.

గతంలో హోంగార్డులుగా పనిచేసిన పలువురు ఇలా చేసినట్లు తేలింది. వారిలో పలువురిని విచారిస్తే ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాకు కొత్త భాష్యం చెప్పారు. ‘ఎక్స్‌ సర్వీస్‌మెన్‌’ అంటే హోంగార్డులుగా ‘గతంలో సేవలందించిన’ విభాగంగా భావించామని చెప్పడంతో అధికారులే అవాక్కయ్యారు. కొందరు దళారులు మాయమాటలు చెప్పి ఈ కోటాలో దరఖాస్తులు చేయించారని తేలడంతో వారిని హెచ్చరించి వెనక్కి పంపివేశారు. ఇలాంటి దరఖాస్తులను తుది ఎంపికకు ముందే క్షుణ్నంగా పరిశీలించాలని నిర్ణయించారు.

కేసుల్ని దాచిపెట్టి గట్టెక్కాలని..: సాధారణంగా లక్షలాది దరఖాస్తులొస్తాయి కాబట్టి ఆదిలోనే అందరి ధ్రువీకరణపత్రాలను నియామక మండలి తనిఖీ చేయదు. తుది దశలో ఎంపికైనవారివే క్షుణ్నంగా పరిశీలిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని క్రితంసారి పలువురు అభ్యర్థులు తమ నేరచరితను దాచిపెట్టారు. ఇలాంటి వారిలో కొందరు తుది విడతకు ఎంపికయ్యారు. అనంతరం పోలీస్‌ వెరిఫికేషన్‌లో వీరిపై క్రిమినల్‌ కేసులున్నట్లు తేలింది. వారిని తిరస్కరించడంతో ఆ పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయాయి. తుదివిడతకు ఎంపికైతే ఎలాగోలా ‘మేనేజ్‌’ చేయొచ్చని భావించినట్లు మండలి అధికారుల విచారణలో తేలింది. ఈక్రమంలో ఈసారి ఇలాంటి దరఖాస్తుదారులపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.