ETV Bharat / state

తండ్రీ కూతురి బంధం... వెలకట్టగలమా ఈ అనుబంధం

author img

By

Published : Jun 20, 2021, 8:11 AM IST

Updated : Jun 20, 2021, 8:29 AM IST

fathers day
ఫాదర్స్​ డే

దేవుళ్లు తమకులేని ఆప్యాయతలను మనుషుల్లో చూసుకోడానికి రక్తసంబంధాలను సృష్టించాడంటారు. నవమాసాలు మోసి జననం ఇవ్వక పోయినా... తన జన్మకు కారణమైన తండ్రి అంటే కూతురికి ఆపేక్ష. నిజమే అబ్బాయి అమ్మ కొంగుచాటు బిడ్డ... అమ్మాయి నాన్న కూచి అంటారు. ఫాదర్స్​డే సందర్భంగా తండ్రీ కూతుళ్ల బంధానికి జీవం పోస్తూ ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.​

ఓ ఇంట అబ్బాయి పుట్టినప్పుడు వారసుడు పుట్టాడని సంతోషపడతారు. అమ్మాయి పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడిపోతారు. అబ్బాయి పుట్టినప్పుడు బయటకెళ్లి అందరితోనూ అరె నాకు వారసుడు పుట్టాడ్రా.. అని చెప్పుకునే తండ్రి... అమ్మాయి పుడితే కూతుర్ని వదిలి బయటకు వెళ్లడు. తనకే తెలియకుండా తన కంటి 'పాప' దగ్గరే కూర్చుండిపోతాడు. తన మోమును చూస్తూ... చిట్టి చిట్టి పాదాలను తాకుతూ.. కోమలమైన చేతులతో ఆడుకుంటూ. బోసి నోరుతో కేరింతలు కొడుతున్న నవ్వుల్లో లీనమైపోయి తాను తండ్రిని అయ్యాననే సంగతే మరచిపోయి పసివాడైపోతాడు. తనతో పసివాడిలా ఆడుకుంటున్న తండ్రిని చూసి ఆ పసిపాప పురిటి మంచంపైనే ఉరకలు వేస్తూ రెట్టించిన ఉత్సాహంతో ఆడుకుంటుంది. పైకి ఎంత గంభీరంగా కనిపించే వ్యక్తి అయినా తన కూతురు దగ్గర పసివాడే.

ఓ వ్యక్తికి ఎంత సంపాదించినా రాని ఆనందం తన గారాలపట్టికి ఓ చిన్న బహుమతి ఇస్తే ఎంతో సంతోషం పడటం మనం చూస్తుంటాం.. కాళ్లకు పట్టీలు పెట్టుకుని.. పట్టుపరికిణి వేసుకుని కేరింతలు కొడుతూ నట్టింట తిరుగుతున్న కూతురు... వీధి గుమ్మంలో తాను కనబడగానే నాన్నగారు అంటూ ఎదురొస్తుంటే... ఎంత ఒత్తిడి ఉన్నా క్షణంలో మాయమైపోతుంది. కూతురుకి ఏమాత్రం నలత చేసినా.. కాస్తంత అవసరమొచ్చినా.. తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది. తన కంటి దీపం నయనాల్లో చిన్న నీటి పొరను చూడగానే రుద్రుడైన శివుడు కూడా మంచులా కరిగిపోతాడనడంలో అతిశయోక్తి లేదు.

పురిటి మంచంపై బిడ్డను చూడగానే ప్రతి వ్యక్తిలో తండ్రి పుడతాడు. తన కూతురు ప్రతి దశను దాటి ఎదుగుతున్నప్పుడు తండ్రి చిన్న పిల్లాడుగా మారతాడు. అవును నిజమే... ప్రతి కూతురికి తండ్రి ఎప్పుడూ చిన్నపిల్లాడే... మొదటిసారిగా నాన్న.... అంటూ తిరుగుతున్నప్పుడు.. తప్పటడుగు వేస్తున్నప్పుడు... అడుగు పరుగై ఇంటిని దాటి వెళ్తున్నప్పుడు.. నడక నేర్చుకున్న కూతురు మారాం చేసి సైకిల్​ కొనిపిచ్చుకుని దానిపై తనని కూర్చోబెట్టుకుని నాన్నగారు.. గట్టిగా పట్టుకోండి అంటూ వేగంగా తొక్కుతూ వెళ్తున్న కూతుర్ని చూస్తూ వెనుక కూర్చున్న తండ్రి కంట వచ్చే ఆనంద బాష్పాలు వెలకట్టలేనివి.

కంటికి రెప్పలా చూసుకుంటూ గారాబం చేస్తుంటే అందరూ వచ్చి ఎందుకయ్యా ఆడపిల్లకు అంత గారాబం చేస్తావు... నీవు ఎంత చదివించినా... ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినా ఓ ఇంట గరిటపట్టుకోవడమేగా... నిన్నేమన్నా చూస్తుందా ఏంటి... అమ్మాయిలకు ఈ చదువులు... ఆటలు ఎందుకు అంటూ ఎన్ని సూటిపోటి మాటలు అంటున్నా... వాళ్లకు మాటతో కాదు... తన కూతురు ఎదిగి ప్రయోజకురాలైన తర్వాత.... విజయగర్వంతో నవ్విన నోళ్లు మూయించాలనుకుంటాడు. అంత భద్రంగా పెంచుకున్న కూతుర్ని... తాను లేని ఇంట్లో తనకంటే భద్రంగా చూసుకునే మనుషుల మధ్యలోకి పంపాలని కోరుకుంటాడు. అందుకు తల తాకట్టు పెట్టడానికైనా వెనకాడడు.

అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన తర్వాత అప్పగింతలప్పుడు భర్త వెంట వెళ్తున్న కూతుర్ని చూసి వదలలేక వదలలేక అందరూ దు:ఖిస్తుంటే తండ్రి మాత్రం మాట్లాడడు.. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందని రాత్రి బస్సెక్కితే తెల్లారేసరికి దిగిపోయంత దూరం అంటూ అందరినీ సమదాయిస్తాడు. అదేంటి ఇంత గారాబంగా చూసుకునే తండ్రి ఇంత కఠినంగా మారిపోయాడు అనుకుంటారంతా... కానీ వెళ్తున్న కూతురు తన దగ్గరకొచ్చి వెళ్లొస్తాను నాన్న అని చెప్పగానే ఉబికి వస్తున్న కన్నీటిని నిగ్రహించుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో తండ్రీ కూతుళ్లకే తెలుస్తుంది.

పుట్టిన నాటి నుంచి పెళ్లి వరకు అనుక్షణం తన కూతురితో గడిపిన తండ్రి... ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకాలతోనే జీవిస్తాడు. ఏదో జామున కూతురు జ్ఞాపకమొచ్చి అప్పటికప్పుడు కూతుర్ని చూడలేని పరిస్థితి తలచుకుని... నా బంగారు తల్లి ఎలా ఉందో... ఏమైపోతుందో అంటూ గాబారాగా ఫోన్​ చేసేందుకు సిద్ధమై... నంబర్లన్నీ నొక్కి... ఈ సమయంలో చేస్తే అత్తింటి వాళ్లు ఏమనుకుంటారో అనుకుని ఒక్కో నంబరు డిలీట్​ చేస్తున్న తండ్రి చేతి వేళ్లు వణుకుతున్న సందర్భాలెన్నో ఉంటాయి. అసలు అమ్మాయిలను అత్తింటికి పంపాలనే సంస్కృతి ఎవరు సృష్టించారా అని తిట్టుకోని తండ్రి ఉండడంటే అతిశయోక్తి ఉండదేమో....

అసలు బాధ అంటే ఏమిటి మనసున్న దు:ఖాన్ని చెప్పుకోలేక పోవడం అంటారు... చెప్పుకోలేని కష్టాన్నైనా కంటి చూపుతో పసిగట్టేంత అనుబంధమే తండ్రీ కూతుళ్ల బంధం కాదంటారా. ఊహలకందని ఆలోచన నాన్న... కాలానికి ప్రతిరూపం ఆయన... కన్నీటి బిందువును అడుగున దాచి... బిడ్డలను పన్నీటిపై నడిపించే నాయకుడు నాన్న... నాన్న అహంకారి ఎందుకంటే.. ఆకాశమంత ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి.

ఇదీ చదవండి: TS UNLOCK: తెలంగాణ అన్​లాక్.. ఇవన్నీ ఓపెన్

Last Updated :Jun 20, 2021, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.