ETV Bharat / state

రికార్డు స్థాయిలో వానాకాలం పంటలసాగు.. ఆనందంలో రైతన్నలు

author img

By

Published : Oct 3, 2020, 1:34 PM IST

ఈ ఏడాది వానా కాలం పంటల సాగు సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతోన్నాయి. అదనంగా 9.86 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో కలుపుకుంటే తాజా సీజన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 1.44 కోట్ల ఎకరాలకు చేరింది. గత నెల 30వ తేదీతో ఖరీఫ్ సీజన్ ముగిసిన దృష్ట్యా రాబోయే యాసంగి సీజన్‌ ఏర్పాట్లుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది.

farmers happy because Record level monsoon harvest in telangana
రికార్డు స్థాయిలో వానాకాలం పంటలసాగు.. ఆనందంలో రైతన్నలు

రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాగు చక్కటి ఆశాజనకంగా ఉంది. అనూహ్యంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది వానా కాలం సాధారణ సాగు విస్తీర్ణం కోటి 3 లక్షల 47 వేల 715 ఎకరాలు నిర్థేశించగా... అనూహ్యంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు ప్రధాన జలాశయాలు, నీటి వనరులు అందుబాటులోకి రావడం, విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.ఐదు వేల పెట్టుబడి సాయం పంపిణీ వెరసి... వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే రికార్డ్ స్థాయికి చేరుకుంది.

పంట నిర్దేశించిన విస్తీర్ణం(ఎకరాల్లో)సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) సాగు శాతం
వరి 27.25 లక్షలు52.5 లక్షలు 195
పత్తి 44.5 లక్షలు30.18 లక్షలు140
కంది 7.61 లక్షలు 10.75 లక్షలు 141

మిగిలిన పంటల వివరాలిలా..

ఇవి కాకుండా సోయాబీన్, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ, ఇతర చిరుధాన్యాల పంటల్లో ఏ ఒక్కటీ 91 శాతం మించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పంటల నష్టం సంబంధించి ఖచ్చితమైన అంచనాలు సేకరించే పనిలో పడినప్పటికీ... తీవ్ర జాప్యం సాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పంట బీమా పథకం కూడా అమల్లోకి లేకపోవడంతో... రైతులు పూర్తిగా ఆ నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని చెప్పవచ్చు.

పెద్ద ఎత్తున గన్నీ సంచుల కొనుగోలు

రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు ద్వారా పత్తి లక్ష్యం చేరింది. వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరి, పత్తి, కందుల దిగుబడులు రాబోతున్న దృష్ట్యా... మార్కెటింగ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పెరుగుత్నున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా భారీగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున గన్నీ సంచులు అవసరమవుతాయి. భుత్వ అవసరాలను గుర్తించి రేషన్ డీలర్లు తమ దగ్గర ఉన్న గన్నీ సంచులు తప్పనిసరిగా పౌరసరఫరాల సంస్థకు విక్రయించాలని మంత్రి ఆదేశించారు.

రబీకి సన్నద్ధం

మరోవైపు, రాబోయే రబీ కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతుల సౌకర్యార్థం... రాయితీ విత్తనాలు, అన్ని రకాల రసాయన ఎరువులు సమకూర్చడంలో నిమగ్నమైంది. యాసంగి సీజన్‌ సంబంధించి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కేంద్రాన్ని కోరగా... 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేందుకు అంగీకరించింది. గత యాసంగిలో సాగు లెక్కల ప్రకారం 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా... ఈసారి ఆ కోటా మరో 2 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. వీటితో పాటు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల డీఎపీ, 1.1 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, 0.5 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ పాస్ఫేట్, 5.5 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో కలిపి 18.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెలంగాణకు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: ఆస్తుల విలువ నిర్ధారణ గడువులోగా పూర్తవుతుందా.. ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.