కాళేశ్వరం తాజా అంచనా వ్యయంపై కసరత్తు... త్వరలోనే స్పష్టత..!

author img

By

Published : Dec 24, 2020, 5:42 AM IST

Updated : Dec 24, 2020, 6:31 AM IST

కాళేశ్వరం తాజా అంచనా తయారీలో నిమగ్నం... త్వరలోనే స్పష్టత..!

కాళేశ్వరం ఎత్తిపోతల సవరించిన అంచనా తయారీలో నీటిపారుదల శాఖ నిమగ్నమైంది. రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చుతో రూపొందించిన డీపీఆర్​ను సవరించి కేంద్రానికి పంపేందుకు కసరత్తు చేస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.... సవరించిన అంచనా సుమారు లక్షా 15వేల కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

కాళేశ్వరం తాజా అంచనా కసరత్తు... త్వరలోనే స్పష్టత..!

రోజుకు రెండు టీఎంసీల నీటిని మళ్లించేలా మొదట కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య బ్యారేజీలు, మధ్యమానేరు దిగువన రిజర్వాయర్లు, లిప్టులు, సొరంగమార్గాలు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, భూసేకరణ, పునరావాసం ఇలా అన్నీ కలిపి 80,500 కోట్ల రూపాయల అంచనాకు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రధాన పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఇదే సమయంలో మేడిగడ్డ నుంచి రోజూ మూడు టీఎంసీలు మళ్లించేలా పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ మళ్లింపునకు సంబంధించిన లిప్టు పనులూ దాదాపు పూర్తయ్యాయి. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు జరుగుతున్నాయి.

కేంద్రం సూచనలతో..

ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డీపీఆర్​లు సమర్పించి ఆమోదం లభించేవరకు పనుల విషయంలో ముందుకెళ్లొద్దని కేంద్రం సూచించింది. ఈ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి ఆమోదం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నా... కేంద్రజల్‌శక్తి మంత్రి తాజాగా రాసిన లేఖలో డీపీఆర్​ ఇచ్చి ఆమోదం లభించే వరకు పనులు ఆపాలని సూచించారు.

ఖర్చుపై అంచనా..

ఈ నేపథ్యంలో డీపీఆర్​లపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేకంగా డీపీఆర్‌ అవసరం లేదని, సవరించిన డీపీఆర్​ అందజేస్తే సరిపోతుందన్న నిర్ణయానికి నీటిపారుదల శాఖ వచ్చింది. దీని ప్రకారం రోజూ మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా పనులు పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేస్తోంది.

మూడు రోజుల్లో...

ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లంతా గత కొన్ని రోజులుగా ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గుత్తేదారులకు పెరిగిన ధరల ప్రకారం అదనంగా చేసిన చెల్లింపులు, జీఎస్టీకి ఎక్కువ చెల్లించాల్సి రావడం, భూసేకరణ వ్యయం పెరగడం, అదనపు పనులు ఇలా అన్నీ కలిపి సుమారు లక్షా 15వేల కోట్ల రూపాయల వరకు తాజా అంచనా ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రెండుమూడు రోజుల్లో కచ్చితమైన అంచనాకు వచ్చిన తర్వాత కేంద్రజలసంఘానికి సవరించిన డీపీఆర్​ను అందజేస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు ఇవ్వండి : కేటీఆర్​

Last Updated :Dec 24, 2020, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.