ETV Bharat / state

'దిశ' మారని భద్రత.. మూడేళ్లయినా మారని పరిస్థితులు..!

author img

By

Published : Nov 27, 2022, 10:24 AM IST

యువ వైద్యురాలు దిశను కిరాతకంగా హతమార్చిన ఉదంతం జరిగి నేటితో మూడేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఔటర్​ రింగురోడ్డు ఇంటర్‌ఛేంజ్‌లు, సర్వీసు రోడ్డు, సమీప ప్రాంతాల్లో భద్రత ఎలా ఉంది.. మహిళలు వెళ్లేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా..? లేదా అనే కోణంలో 'ఈటీవీ భారత్'​ కొన్ని ప్రాంతాల్లో పరిశీలన చేసింది. అందులో ఏం తేలిందంటే..?

Disha death
Disha death

Women safety in Hyderabad: అడుగడుగునా ఆకతాయిల అలజడి.. మందుకొడుతూ కేకలు వేసే పోకిరీలు.. రోడ్డుకు ఇరువైపులా వరుసకట్టిన లారీలు.. చిమ్మచీకట్లో దారి కూడా కనిపించని భయానక పరిస్థితి.. నగర శివార్లలో ఔటర్‌ రింగు రోడ్డు, సర్వీసు రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన పరిస్థితి ఇది. యువ వైద్యురాలు దిశను కిరాతకంగా హతమార్చిన ఉదంతం జరిగి ఆదివారంతో మూడేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఔటరు రింగురోడ్డు ఇంటర్‌ఛేంజ్‌లు, సర్వీసు రోడ్డు, సమీప ప్రాంతాల్లో భద్రత ఎలా ఉంది.. మహిళలు వెళ్లేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా..? లేదా అనే కోణంలో 'ఈటీవీ భారత్'​ కొన్ని ప్రాంతాల్లో పరిశీలన చేసింది. ఈ సందర్భంగా అక్కడ భయానక పరిస్థితులు కనిపించాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.

లైట్లు వెలిగితే ఒట్టు: భారీ విద్యుద్దీపాలతో ఔటర్‌ రింగురోడ్డు కాంతులీనుతుంటే పక్కనే సర్వీసు రోడ్డు వెంబడి చిమ్మ చీకటి కనిపిస్తోంది. ఇంటర్‌ ఛేంజ్‌ల దగ్గర మినహా ఎక్కువ ప్రాంతాల్లో దీపాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా వెలగడం లేదు. చీకటిపడితే అక్కడికి వెళ్లకపోవడమే మేలనేలా పరిస్థితులున్నాయి. వేలల్లో వాహనాల రాకపోకలు సాగించే ఈ దారిలో ఒంటరిగా లేదా దంపతులు వెళ్లాలన్నా, మహిళలతో ప్రయాణించాలన్నా జడుసుకోవాల్సినందే. ఈ దారిలో వాహనాలు ప్రమాదాలకు గురైనా.. మొరాయించినా వెంటనే సమాచారం అందించి రక్షణ, సహాయం పొందేందుకు ఎవరికి ఫోన్‌ చేయాలో తెలిపే సూచికలు లేవు. పరిశీలన చేసిన మెజార్టీ ప్రాంతాల్లో అంతా అంధకారమే కనిపించింది.

..

కనిపించని పెట్రోలింగ్‌: ఘట్‌కేసర్‌, శంషాబాద్‌ మినహా ఇతర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వాహనాలు కనిపించలేదు. దిశ ఉదంతం తర్వాత గస్తీ పెంచుతామని ప్రకటించినా ఆ స్థాయిలో కనిపించలేదు. పోలీసు పర్యవేక్షణ లేదన్న భరోసాతో అక్కడక్కడా రోడ్డుపక్కన ఫుట్‌పాత్‌లపై బృందాలుగా కూర్చుని మద్యం తాగుతున్నారు. కొన్నిచోట్ల వాహనాలపై ఒక్కరే వస్తుండడాన్ని గమనించి దారిదోపిడీలకు దిగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆ రోజు ఏం జరిగిందంటే: అది 2019 నవంబరు 28వ తేదీ.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాలు అమ్మేందుకు వెళ్తున్న ఓ యువకుడు షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి సమీపంలో 44వ నంబరు జాతీయరహదారి బైపాస్‌ కింద కాలిపోతున్న ఓ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఆమె శంషాబాద్‌కు చెందిన యువతిగా గుర్తించారు.

లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసే ఆరిఫ్‌, చెన్నకేశవులు, శివ, నవీన్‌లు ముందురోజు రాత్రి తొండుపల్లి గేటువద్ద ఆమె వాహనానికి పంక్చర్‌ చేసి సహాయం చేస్తున్నట్లు నటించి నిర్బంధించారు. సమీపంలో ఉన్న ఓ గదిలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత లారీలో షాద్‌నగర్‌ సమీపంలోకి తీసుకెళ్లి సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డిసెంబరు 6న నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం మరో సంచలనం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.