ETV Bharat / state

Etela Rajender Latest Comments : 'బీఆర్​ఎస్​ను ఓడించే సత్తా కాషాయ దళానికి మాత్రమే ఉంది'

author img

By

Published : Jul 4, 2023, 6:55 PM IST

Updated : Jul 4, 2023, 7:16 PM IST

Etela Rajender
Etela Rajender

Etela Rajender as BJP State Election Management Committee Chairman : రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈటల రాజేందర్‌ తెలిపారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా తనకు అవకాశం ఇచ్చిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు చెప్పారు. బీఆర్​ఎస్​ను ఓడించే సత్తా కాషాయ దళానికి మాత్రమే ఉందని ఈటల ధీమా వ్యక్తంచేశారు.

BJP Appointed Etela as Party State Election Management Committee Chairman : రాష్ట్ర బీజేపీలో గత కొన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠ పరిణామాలకు తెరదించిన ఆ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన జాతీయ నాయకత్వం... మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్థానంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో హయత్​నగర్​లోని కార్పొరేటర్ జీవన్​రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల... తనపై విశ్వాసంతో తెలంగాణలో పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Etela Rajender Latest Comments : తెలంగాణలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించడం పట్ల ఈటల రాజేందర్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం తనపై పెట్టిన విశ్వాసాన్ని శక్తివంచన లేకుండా నిలుపుకుంటామని ఈటల స్పష్టం చేశారు. దేశానికి ఒక ఓబీసీ ప్రధానిని అందించిన పార్టీ బీజేపీయే అన్నారు. బండి సంజయ్‌ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచిందన్నారు. తెలంగాణలో గెలిస్తే బీజేపీ లేదంటే బీఆర్‌ఎస్‌ గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలవలేదన్నారు.

'తెలంగాణ అంతరంగం, సమస్యలు పూర్తిగా తెలిసిన వాడిని. సీఎం కేసీఆర్‌ బలం, బలహీనతపై అవగాహన ఉన్నోడిని. పార్టీ అధిష్ఠానం అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్‌ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనతో కలిసి పని చేస్తా. కేసీఆర్‌ అహంకారాన్ని ఓడించడం బీజేపీతోనే సాధ్యం. బండి సంజయ్‌ నేతృత్వంలో నాలుగు ఎన్నికలు గెలిచాం. రాష్ట్రంలో గెలిస్తే బీజేపీ.. లేదంటే బీఆర్​ఎస్ గెలిచాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ ఎన్నికనూ గెలవలేదు. బీఆర్​ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం.'-ఈటల రాజేందర్​, హుజురాబాద్ ఎమ్మెల్యే

ఈటల రాజేందర్ ప్రస్థానమిలా... తెలంగాణ ఉద్యమంలో, బీఆర్​ఎస్​లో కీలక నేతగా ఉన్న ఈటల... అప్రతిహతంగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో టీఆర్​ఎస్ తరఫున కమలాపూర్‌ నుంచి తొలిసారిగా గెలుపొందిన ఆయన... కేసీఆర్ పిలుపుతో 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. 2009నుంచి 2021 వరకు జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో ఆయన 5సార్లు విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొంది... కేసీఆర్‌ మంత్రివర్గంలో రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 2021లో నెలకొన్న పరిణామాలతో బీజేపీ గూటికి చేరుకున్న ఈటల రాజేందర్‌... ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని సన్నిహితులు, అనుచరుల వద్ద చెబుతూ వస్తున్న ఈటల... కొన్ని రోజుల క్రితం అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఇటీవల కొన్ని రోజులుగా బీజేపీలో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న వేళ... ఈటలకు ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

కేసీఆర్‌ బలం, బలహీనతలు తెలిసినవాడిని: ఈటల రాజేందర్‌

ఇవీ చదవండి :

Last Updated :Jul 4, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.