ETV Bharat / state

ఈ విద్యార్థుల ఆవిష్కరణలు చూస్తే ఔరా అనాల్సిందే!

author img

By

Published : Mar 19, 2020, 12:28 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సృజనాంకుర కార్యక్రమం విద్యార్థుల వినూత్న ఆలోచనలకు, అద్భుత ఆవిష్కరణలకు వేదికలా నిలిచింది. రైతులకు, సాగు రంగానికి మేలు చేసేలా మెజార్టీ ఆవిష్కరణలు ఉండటం విశేషం. దైనందిన జీవితాన్ని మెరుగ్గా గడిపేందుకు,పర్యావరణాన్ని పరిరక్షించేదుకు కూడా మరికొన్ని ఉపకరణాలు తయారుచేశారు.

engineering-students-have-made-great-innovations
ఈ విద్యార్థుల ఆవిష్కరణలు చూస్తే ఔరా అనాల్సిందే!

ఈ విద్యార్థుల ఆవిష్కరణలు చూస్తే ఔరా అనాల్సిందే!

యువతరంలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసే లక్ష్యంతో... ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ప్రతిఏటా సృజనాంకుర పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈసారి కూడా సృజనాంకుర- 2020 పేరిట మూడు రోజుల పాటు ఉత్సవాలు జరిపారు. ఇక్కడ చదివే విద్యార్థులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు.. 50కి పైగా ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కొన్ని నమూనా కోసం ఉంచినవి కాగా... మరికొన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయి.

చినుకు పడినా చింతలేకుండా

అన్నదాతకు మేలు జరిగేలా నలుగురు విద్యార్థులు.... పంటపొలాల్లో ఆధునిక డ్రైనేజి వ్యవస్థను రూపొందించారు. అధిక వర్షం పడినప్పుడు... పొలంలో ఉన్న నీటిని తోడేస్తుంది ఈ విధానం. కేవలం 60 వేల రూపాయలతో అమర్చిన ఈ పరికరం 15 సంవత్సరాలు పనిచేస్తుంది.

పొలం గట్టు నుంచే ఎరువు వేయొచ్చు

రైతులకు ఉపయోగపడేలా విద్యార్థులు రూపొందించిన మరో పరికరం... ఆటోమేటిక్ ఫర్టిలైజర్​ డిస్పెన్షింగ్ మెషిన్. మెకానికల్‌ ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఈ పరికరం తయారు చేశారు. దీని ద్వారా పొలాల్లో మనిషి సాయం లేకుండా ఎరువులను చల్లే వెసులుబాటు ఉంటుంది. రైతులు పొలం గట్టున ఉండి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నియంత్రించేలా సాంకేతికతను ఇనుమడింపచేశారు. కేవలం 8వేల 500 రూపాయలతో దీనిని రూపొందించారు.

పాడి రైతులకు సాయంగా

పాడి రైతులకు ఉపయోగపడేలా విద్యార్థులు తయారు చేసిన మరో ఉపకరణం గడ్డికోత యంత్రం. సౌరశక్తితో పనిచేయడం దీని ప్రత్యేకత. ఓసారి ఛార్జింగ్ చేస్తే ఏకధాటిగా 6గంటల పాటు పనిచేస్తుంది. దీని ధర కేవలం 17వేల రూపాయలు.

చౌకగా సూపర్ సైకిల్

మరికొందరు విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి ఎలక్ట్రిక్​ సైకిల్ తయారు చేశారు. దీనిని ఓసారి ఛార్జింగ్ చేసుకుంటే 80 కిలోమీటర్లు వెళ్లవచ్చు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. విద్యార్థులు ఈ సైకిల్ తయారీకి 11వేల రూపాయలు ఖర్చు చేశారు. మార్కెట్లో ఇలాంటి సైకిల్ కొనుగోలు చేయాలంటే 32వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

తక్కువ పెట్టుబడితే పంటలు సాగుచేసే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించటం.. జల సంరక్షణ... ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి.. శక్తి వనరుల తయారీ.. పర్యావరణ పరిరక్షణ అంశాలపైనా విద్యార్థులు కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొందించారు. చాలామంది విద్యార్థులు తాము తయారు చేసిన పరికరాలకు పేటెండ్ పొందే ఆలోచనలో ఉన్నారు.

ఇదీ చదవండి: పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్​లతో హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.