ETV Bharat / state

EC Appoints EROs and DEOs : తెలంగాణ జిల్లాలకు ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు నియామకం

author img

By

Published : Jul 18, 2023, 10:36 PM IST

EC
EC

EC Appoints EROs and DEOs for Telangana : ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్​ను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం... మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా కలెక్టర్లను నియమించింది.

Telangana Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఈసీ నియమించింది. ఈ మేరకు అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్​ఎంసీ) కమిషనర్ వ్యవహరించనున్నట్లు ఈసీ పేర్కొంది.

అదేవిధంగా మిగిలిన 32 జిల్లాలకు ఎన్నికల అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈఆర్వోలుగా.. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఐటీడీఏ పీఓలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఓటర్ల జాబితా నిర్వహణ, ఓటర్ల నమోదు, వివరాలు తదితరాలను ఈఆర్వోలు పర్యవేక్షిస్తారు.

Deputy Commissioners Transferred in GHMC : మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికారుల బదిలీలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో భారీగా డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్‌ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కమిషనర్‌, జోనల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కింది స్థాయిలో పనిచేస్తున్న డీసీలను కూడా బదిలీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉండగా.. వారిలో 26 మందిని బదిలీ చేశారు. గతంలో నలుగురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు.

Municipal Commissioners Transferred In Telangana : రాష్ట్రంలోని పురపాలక శాఖలో భారీగా మున్సిపల్​ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయాలు సహా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 22 మంది అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ కార్యాలయం నుంచి బి.గీత రాధికను జీహెచ్ఎంసీకి ప్రభుత్వం బదిలీ చేసింది. సీడీఎంఏ కార్యాలయంలో సంయుక్త సంచాలకులుగా టి.కృష్ణమోహన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

బడంగ్​ పేట మున్సిపల్​ కమిషనర్​గా బి. సుమన్​ రావు, రామగుండం కమిషనర్​గా సీహెచ్​. నాగేశ్వర్​, మీట్​పేట కమిషనర్​గా ఏ.వాణి, ఖమ్మం కమిషనర్​గా బి.సత్యనారాయణరెడ్డి, మిర్యాలగూడకు ఎంపీ పూర్ణచందర్​ రెడ్డి, నందికొండకు కే.వేణుగోపాల్​, పోచారం కమిషనర్​గా పీ.వేమన్​రెడ్డి, దమ్మాయిగూడ కమిషనర్​గా ఎస్​.రాజమల్లయ్యలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇబ్రహీంపట్నం కమిషనర్​ మహ్మద్​ యూసఫ్​ను పదోన్నతిపై జీహెచ్​ఎంసీకి తరలించింది. హుస్నాబాద్​కు ఆర్​.రాజశేఖర్​ను, ఏ.వెంకటేశ్​ను కొత్తపల్లి మున్సిపల్​ కమిషనర్​గా.. పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.