ED Raids in Hyderabad : 'జూద' పర్యటనలపై ఈడీ కన్ను.. ప్రముఖుల్లో వణుకు

author img

By

Published : Jul 28, 2022, 9:34 AM IST

casino: జూద పర్యటనలపై ఈడీ కన్ను.. వణుకుతున్న ప్రముఖులు

ED Raids in Hyderabad : జూదం మాటున నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలువురు టూర్‌ ఆపరేటర్లపై హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు కలకలం రేపాయి. విదేశాల్లోనూ ప్రత్యేక ఈవెంట్ల పేరుతో జూదం ఆడించేందుకు జనాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

ED Raids in Hyderabad : క్యాసినోలకు జనాలను తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్‌లో పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. గోవాలో క్యాసినోలు నిర్వహించడంతో పాటు నేపాల్, థాయ్‌లాండ్‌లలో జరిగే జూదంలో పాల్గొనేందుకు.. హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా కొందరు ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తున్నారు. రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజుల పాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో ఎక్కువ మందిని శ్రీలంక తీసుకెళ్లేవారని ఈడీ అధికారులు గుర్తించారు. అక్కడి పరిస్థితులు సరిగా లేకపోవటంతో నేపాల్‌కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం నుంచి బోయిన్‌పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. సైదాబాద్‌లోని చీకోటి ప్రవీణ్‌ ఇంట్లో అర్ధరాత్రి తనిఖీలు కొనసాగాయి. జూబ్లీహిల్స్‌ సహా మరో 8 ప్రాంతాల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. సాయంత్రం వరకూ జరిగిన తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

జూద పర్యటనలతో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. దొడ్డిదారిలో విదేశాలకు సొమ్ము తీసుకెళుతున్నారని.. గెలుచుకున్న డబ్బును హవాలా ద్వారా స్వదేశానికి రప్పించుకుంటున్నారని అనుమానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో జూదంలో గెలుచుకొని.. దానిని హవాలా మార్గంలో స్వదేశానికి రప్పించినట్లు ఈడీకి సమాచారం అందిందని, దాని ఆధారంగానే దాడులు నిర్వహించారని తెలుస్తోంది.

చీకోటి ప్రవీణ్‌.. చీకటి దందా ఏళ్ల క్రితం నుంచే నడుస్తున్నట్లు తెలుస్తోంది. గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్‌లలో క్యాసినోల నిర్వహణతో పాటు స్థానికంగానూ జూదం సాగించి అతడు పోలీసులకు చిక్కిన ఉదంతాలున్నాయి. నగరంలోని కొన్ని క్లబ్‌లు ఇతడి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏటా తన జన్మదిన వేడుకల పేరిట ప్రవీణ్‌ హడావుడి చేసేవాడు. గత నెలలో జరిగిన వేడుక సందర్భంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్, ఎక్సైజ్‌ అధికారులు హాజరయ్యారు. ఇతర నగరాల నుంచి పలువురు ప్రముఖులు ఛార్టర్డ్‌ విమానాల్లో ఇక్కడికి వచ్చారు.

సోదాల్లో జూదం ఆడటానికి ఉపయోగించే టోకెన్లు పెద్ద మొత్తంలో దొరికినట్లు సమాచారం. ఈడీ దాడుల గురించి తెలియగానే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, అధికారులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. జూద పర్యటనలు నిర్వహించే వారికి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు చెందిన అనేక మంది సినీ తారలతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.