ETV Bharat / state

Woman IPS Officers: వీరవనితలు.. అందుకే ఐపీఎస్​ అయ్యారు..

author img

By

Published : Nov 11, 2021, 6:56 AM IST

మహిళల జీవితాల్లో అడుగడుగునా ఎదురవుతున్న చేదు అనుభవాలు ఆ డాక్టరమ్మని కదిలించాయి. వాళ్లని ఆదుకోవాలంటే డాక్టర్‌గా తన శక్తి సరిపోదనిపించింది.. అందుకే సివిల్స్‌లో విజయం సాధించి ఐపీఎస్‌ శిక్షణలో బ్యాచ్‌ టాపర్‌గా నిలిచింది డాక్టర్‌ దర్పణ్‌ అహ్లూవాలియా. ‘నిన్ను పోలీస్‌ యూనిఫాంలో చూడాలనుంది’ అన్న అమ్మకోరికని నిజం చేయడం కోసం నేపాల్‌ నుంచి వచ్చి శిక్షణ తీసుకుంది 25ఏళ్ల సిమోన్‌ ధితాల్‌...  హైదరాబాదులోని జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తయిన సందర్భంగా వసుంధరతో వారు పంచుకున్న మనోభావాలివీ...

Woman IPS Officers
doctor Darpan ahluvaliya and Simon dithol

''వైద్యురాలినైన నేను సివిల్స్‌ వైపురావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. మాది పంజాబ్‌లోని మొహాలీ. నాన్న గురీందర్‌ సింగ్‌ పశుసంవర్థక శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌. నామీద అమ్మ నవనీత్‌ ప్రభావమూ చాలా ఉంది. నా విజయానికి అమ్మా కారణమే. తను ఎకనామిక్స్‌లో ఎంఫిల్‌ చేసింది. పేదపిల్లలకు ఉచితంగా చదువు చెప్పించేది. మా తాతగారు పోలీసు విభాగంలో అందించిన సేవల గురించి చిన్నప్పట్నుంచీ వినేదాన్ని. నేనూ పోలీసు అవ్వాలని కలలు కన్నా. కాలేజీకి వచ్చేసరికి డాక్టర్‌ అవ్వాలనుకున్నా. ఎంబీబీఎస్‌లో మంచి ర్యాంకు వచ్చింది. ఎయిమ్స్‌ మెడికల్‌ టెస్ట్‌లో రెండో ర్యాంకుతో పాటియాలా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చేరా. 2017లో డాక్టర్‌గా విధుల్లో చేరా. డ్యూటీలో చేరిన మొదటి రోజుని ఇప్పటికీ మర్చిపోలేను. నాకన్నా చిన్న అమ్మాయి... ప్రసవం కోసం వచ్చింది. కానీ ఆమె బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఆరాతీస్తే... చాలా పేదమ్మాయి. పెళ్లి, పిల్లలకు అర్థం తెలియని చిన్న వయసు.

డాక్టర్‌ దర్పణ్‌ అహ్లూవాలియా

తర్వాతా చనిపోయిన బిడ్డలను ప్రసవించడం లేదా వాళ్లే ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు చాలానే ఎదురయ్యాయి. ఇటువంటి వారికి అవగాహన కలిగించాలని డాక్టర్‌గా చేరిన మొదటి రోజే అనుకున్నా. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించలేక ప్రాణాలు కోల్పోతున్న మహిళలనెందరినో కూడా చూశా. దాంతో ‘పింక్‌లింక్‌’ ఎన్జీవోను ప్రారంభించా. ఉద్యోగం చేస్తూనే రొమ్ము క్యాన్సర్‌ అవగాహన శిబిరాలు నిర్వహించేదాన్ని. చాలామంది మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారు. వాళ్లసామాజిక, కుటుంబసమస్యల గురించి అప్పుడే తెలిసింది. నా వంతు సాయం చేయాలంటే డాక్టర్‌గా కాక అధికారిగా మారాలనుకున్నా. ఇలా ఎన్నో సంఘటనలు నన్ను సివిల్స్‌వైపు నడిపించాయి. సివిల్స్‌ మొదటిసారి రాసినప్పుడు ప్రిలిమినరీ వరకే వెళ్లా. రెండోసారి 80వ ర్యాంకు తెచ్చుకున్నా.

నేషనల్‌ పోలీసు అకాడమీలో మాది 73వ బ్యాచ్‌. శిక్షణలో ఎందరో బాధితులను కలుసుకున్నా. వారి సమస్యలన్నీ వినేదాన్ని. వాటి నుంచి మరిన్ని విషయాలను గ్రహించగలిగా. అకాడమీలో అధికారులు, శిక్షకులు, బ్యాచ్‌మేట్లు నాకు ఎంతో చేయూతనిచ్చారు. కేఎస్‌ వ్యాస్‌ ట్రోఫీ రావడం, పాసింగ్‌ అవుట్‌పెరేడ్‌కు నేతృత్వం వహించే అదృష్టం దక్కడం చాలా సంతోషాన్నిచ్చాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి పరిస్థితులను ముందుగా అవగాహన చేసుకోవడానికి కృషి చేస్తా. సామాజికంగా, చట్టపరంగా వారికి న్యాయం దక్కేలా చేయడానికి ప్రయత్నిస్తా. ఏదైనా సమస్య వస్తే ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది పోలీసులే. ఆ నమ్మకాన్ని నిలబెడతాను. మహిళలకు నేను చెప్పేదేంటంటే.... ఆత్మస్థైర్యం ఉంటే చాలు. ఏదైనా సాధించగలమని.''

-డాక్టర్‌ దర్పణ్‌ అహ్లూవాలియా

నా యూనిఫాం అంటే అమ్మకు చాలా ఇష్టం...

సిమోన్‌ ధితాల్‌

''మా ఇంట్లో పోలీసు ఉద్యోగం చేసేవాళ్లు ఎవరూ లేకపోయినా పోలీసులు ధరించే యూనిఫాం, షూస్‌ నన్ను ఆకర్షించేవి. నేనూ వాళ్లలాగే ఆ దుస్తులు వేసుకోవాలని అనుకునేదాన్ని. దానికితోడు ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నిన్ను చూడాలనుందని అమ్మ కళావతి అంది. దాంతో సీఏ తర్వాత పోలీసు ట్రైనింగ్‌లో చేరా. అనుకున్నట్లుగానే 2017లో మా దేశ పోలీసు విభాగంలో స్థానాన్ని సంపాదించగలిగా. హైదరాబాద్‌లోని అకాడమీలో ట్రైనింగ్‌ పొందగలిగా. ఇంటికి వస్తే ఐపీఎస్‌ ఆఫీసర్‌గా యూనిఫాంతోనే రావాలన్న అమ్మ కోరిక తీర్చగలిగా. ఈ నీలిరంగు దుస్తులంటే ఆమెకెంతో ఇష్టం. శిక్షణలో భాగంగా గృహహింస, అత్యాచారానికి గురైనవారిని ఎన్జీవోల ద్వారా కలుసుకున్నప్పుడు అటువంటి వారికందరికీ న్యాయం చేయాలనిపించింది. నా బాధ్యతలో వీటికి ప్రాముఖ్యతనిస్తా. రాకెట్‌ లాంఛర్‌, మోటర్‌ ట్రైనింగ్‌ శిక్షణ కష్టంగా అనిపించినా ఈ వృత్తి అంటే ఉన్న ఇష్టం ముందు ఆ కష్టం పెద్దదేం కాదనుకోండి. మహిళలందరికీ నేను చెప్పేదేంటంటే కన్నకలలు, లక్ష్యాలను సాధించడంలో కష్టాలెన్నెదురైనా ధైర్యంగా పోరాడి గెలవాలి.''

- సిమోన్‌ ధితాల్‌, నేపాల్‌

ఇదీ చూడండి: new zonal system: వీడని జోనల్​ పీటముడి.. నిరుద్యోగుల ఎదురుచూపులు

mla quota mlc elections: నేడో, రేపో శాసనభ్యుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.