Power Charges: విద్యుత్‌ వినియోగదారులకు మరో షాక్‌.. ఏంటంటే?!

author img

By

Published : Sep 13, 2021, 9:09 AM IST

power shock
power shock ()

విద్యుత్​ వినియోగదారులకు మరో షాక్​ ఇచ్చేందుకు విద్యుత్​ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సిద్ధమయ్యాయి. ఇప్పటికే కోట్ల రూపాాయాల భారం మోపిన డిస్కంలు.. మరోసారి కోట్ల రూపాయల సర్దుబాటుకు అవకాశమివ్వాలని ఇటీవల ఏపీఈఆర్‌సీకి ట్రూఅప్‌ పిటిషన్‌ను దాఖలు చేశాయి. అయితే దీనిపై ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఏపీలో విద్యుత్‌ వినియోగదారులకు మరో షాక్‌ తగలబోతోందా?. 2014-15 నుంచి 2018-19 వరకు అయిదేళ్ల కాలానికి ట్రూఅప్‌ కింద రూ.3,669 కోట్ల భారాన్ని ఇప్పటికే వినియోగదారులపై వేసిన విద్యుత్‌ పంపిణీ సంస్థలు మరో సర్దుబాటు (ట్రూఅప్‌)కు సిద్ధమయ్యాయి. 2019-20లో టారిఫ్‌లో అనుమతించిన వ్యయానికి.. వాస్తవ ఖర్చులకు మధ్య వ్యత్యాసం రూ.2,542.70 కోట్లుగా తేల్చాయి. ఇందులో దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) రూ.1,841.58 కోట్లు, తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) రూ.701.12 కోట్ల సర్దుబాటుకు అవకాశమివ్వాలని ఇటీవల ఏపీఈఆర్‌సీకి ట్రూఅప్‌ పిటిషన్‌ను దాఖలు చేశాయి. దీనిపై విచారించి వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాయి. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత.. ఎంతమేర సర్దుబాటుకు అనుమతించాలో ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే అనుమతించిన రూ.3,669 కోట్ల ట్రూఅప్‌నకు సంబంధించి ఈ నెల బిల్లు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. తాజా సర్దుబాటును అనుమతిస్తే ఈ భారం మరింత పెరగనుంది.

అధిక ధరకు కొన్నామని..

2019-20లో ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ ఆర్డర్‌లో అనుమతించిన విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు తగ్గినా డిస్కంలు ట్రూఅప్‌ పిటిషన్‌ దాఖలు చేయటం గమనార్హం. బొగ్గు కొరత కారణంగా రాష్ట్ర విద్యుత్‌ అభివృద్ధి సంస్థ నుంచి విద్యుత్‌ రాలేదని.. జెన్‌కో, కేంద్ర ఉత్పత్తి సంస్థలు, గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తి ప్లాంట్లు, పునరుత్పాదక విద్యుత్‌ తగ్గిన కారణంగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనాల్సి వచ్చిందని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి.
టారిఫ్‌ ఆర్డర్‌లో అనుమతించిన 41,604.68 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కంటే 1,259.63 ఎంయూల విద్యుత్‌ను తక్కువ కొనుగోలు చేసింది. 37,166.70 ఎంయూల విద్యుత్‌ విక్రయాలకు కమిషన్‌ అనుమతించింది. వ్యవసాయానికి అనుమతించిన విద్యుత్‌ కంటే అధికంగా వినియోగించిన మొత్తం పోను 35,158.60 ఎంయూలు విక్రయించినట్లు పేర్కొంది. ఈ మొత్తానికే ట్రూఅప్‌ ప్రతిపాదనను దాఖలు చేసింది.

  • అవసరానికి మించి 5,564.87 ఎంయూల విద్యుత్‌ అదనంగా అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో డిస్కంలు ప్రతిపాదించిన 4,041.30 ఎంయూల కొనుగోలుకు స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలన్న ప్రతిపాదనను ఏపీఈఆర్‌సీ తిరస్కరించింది.
  • బొగ్గు కొరత కారణంగా టారిఫ్‌ ఆర్డర్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఏపీపీడీసీఎల్‌ నుంచి 2,500 ఎంయూల విద్యుత్‌ తక్కువగా వచ్చిందని తెలిపింది. డిస్కంల మధ్య సర్దుబాటు కింద ఏపీఈపీడీసీఎల్‌కు అనుమతించిన 616.34 ఎంయూలకు బదులుగా 4,854.88 ఎంయూలు తీసుకుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్‌సీ అనుమతించిన 390.44 ఎంయూలకు బదులుగా 2,486.30 ఎంయూలను స్వల్పకాలిక ఒప్పందాల కింద అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవటానికి మెరిట్‌ ఆర్డర్‌ డిస్పాచ్‌ కింద ప్రతిపాదించిన విద్యుత్‌ అందుబాటులో లేకపోవడంతో 2,100 ఎంయూలను బహిరంగ మార్కెట్‌ నుంచి కొన్నట్లు పేర్కొంది.

ఏపీఈపీడీసీఎల్‌ లెక్కలు ఇలా

పీఈఆర్‌సీ టారిఫ్‌ ఆర్డర్‌లో అనుమతించిన 24,154.22 ఎంయూల కంటే 1,299.95 ఎంయూలను తక్కువగానే కొనుగోలు చేసింది. వ్యవసాయానికి వినియోగించిన అదనపు విద్యుత్‌ పోను 21,995.59 ఎంయూల విద్యుత్‌ విక్రయాలకు అనుమతిస్తే.. 20,444.31 ఎంయూల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయి.

  • బొగ్గు కొరత కారణంగా ఏపీపీడీసీఎల్‌ నుంచి 1,313.23 ఎంయూల విద్యుత్‌ తక్కువగా వచ్చిందని పేర్కొంది. జెన్‌కో నుంచి 529.40 ఎంయూలు, సెంట్రల్‌ జనరేషన్‌ స్టేషన్స్‌ నుంచి 756.58 ఎంయూలు, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి 400.03 ఎంయూలు, పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి 4,732.42 ఎంయూల విద్యుత్‌ తక్కువగా అందినట్లు పేర్కొంది. దీంతో విద్యుత్‌ డిమాండ్‌ సర్దుబాటు కోసం టారిఫ్‌ ఆర్డర్‌లో అనుమతించిన 203.56 ఎంయూలకు బదులుగా 1,084.11 ఎంయూలను బహిరంగ మార్కెట్‌ నుంచి కొనాల్సి వచ్చింది.
  • చర వ్యయం కింద రూ.71,968.07 కోట్లను ఈపీడీసీఎల్‌కు కమిషన్‌ అనుమతించింది. ఇందుకోసం రూ.437.56 కోట్లను డిస్కం అదనంగా వెచ్చించింది. దీనివల్ల ఏపీఈఆర్‌సీ యూనిట్‌కు అనుమతించిన చర వ్యయం రూ.2.97 కంటే అదనంగా 36 పైసలు భారం పడింది. రవాణా, ఇంధన ఛార్జీలు పెరగడంతో చర వ్యయం టారిఫ్‌ ఆర్డర్‌లో అనుమతించిన దానికంటే పెరిగిందని పేర్కొంది.
డిస్కంల ట్రూఅప్​ ప్రతిపాదనలు

ఇదీ చూడండి: Gazette Notification: నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.