ETV Bharat / state

Dial 100 Review of 2020: 'బందోబస్తు బాధ్యతలే కాదు.. ఆపదలోనూ ఆదుకుంటాం'

author img

By

Published : Dec 27, 2021, 9:29 AM IST

Dial 100 Services in Telangana: చిన్నచిన్న సేవల నుంచి అత్యవసర ఆరోగ్య పరిస్థితుల వరకు ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకొచ్చేది డయల్​ 100. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా సరే ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే సమీపంలోని పోలీసుల్ని వీలైనంత తొందరగా అక్కడికి పంపించడమే కాకుండా బాధితులకు సాయం అందేవరకు పర్యవేక్షించే బాధ్యతను ఆ శాఖ భుజానికెత్తుకుంది. రాష్ట్రంలోని అన్ని ఠాణాలతోపాటు 108 ఆంబులెన్స్‌, గస్తీ వాహనాలనూ అనుసంధానం చేసుకొని సేవలందిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ డయల్ 100 బృహత్తర పాత్ర పోషించింది.

Dial 100 Services in Telangana
డయల్ 100

Dial 100 Services: అర్ధరాత్రి ఆపద వచ్చినా.. ఆలుమగలు గొడవపడినా.. అనుకోని ప్రమాదం ఎదురైనా.. ఒక్క ఫోన్‌కాల్‌తో క్షణాల్లో వచ్చి... అవాంతరాల నుంచి బయటపడేస్తారు. లాఠీపట్టి బందోబస్తు బాధ్యతలే కాదు.. ప్రాణదాతలుగా కూడా వ్యవహరిస్తున్నారు. గాయాలపాలైన బాధితులకు ప్రథమచికిత్స అందిస్తున్నారు. క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారి ఊపిరి నిలిపి.. జీవితం విలువ తెలియజేస్తున్నారు. 100కు ఫోన్‌‌ వస్తే చాలు వాయువేగంతో ఘటనాస్థలికి వెళ్లి.. ఆపద నుంచి బాధితులను బయటపడేస్తున్నారు.

సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో రోజుకు సగటున 800-900 ఫోన్‌కాల్స్‌ కంట్రోల్‌రూమ్‌కు వస్తుంటాయి. అర్బన్‌ పరిధి అయితే 5 నిమిషాల్లో- గ్రామీణ ప్రాంతానికి 6 నిమిషాల్లో చేరుకుంటున్నారు. డయల్‌ 100 నెంబర్‌ ఫోన్‌కాల్స్‌ను ఐటీ సెల్‌ పర్యవేక్షిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మొబైల్‌ పెట్రోలింగ్‌ వాహనం, ఎస్‌హెచ్‌వో, పోలీస్‌స్టేషన్‌ అందర్నీ ఒకేసారి అప్రమత్తం చేస్తుంది. ఘటనాస్థలానికి పోలీసులు చేరేంత వరకూ అన్నిస్థాయిల్లో యంత్రాంగం పర్యవేక్షణ కొనసాగుతుంది. ట్రాఫిక్‌ సమస్య, ఇతర ఇబ్బందులతో వాహనం అక్కడకు చేరకపోవటం వంటి అవాంతరాలు ఎదురైనపుడు ఐటీ సెల్‌కు సమాచారం చేరుతుంది. ఎవరెక్కడ ఉన్నారనే దాన్ని సమన్వయం చేసుకుంటారు. ఫోన్‌ చేసిన వారికి సాయం అందగానే దాన్ని రికార్డు రూపంలో భద్రపరుస్తున్నారు. ఆలస్యమైతే కారణాలను విశ్లేషించి.. అజాగ్రత్తగా వ్యవహరించినట్టు ధ్రువీకరిస్తే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది జనవరి-నవంబరు వరకూ కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్‌లో రహదారి ప్రమాదాలు, ఆలుమగల కీచులాటలు, గొడవలు అధికంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

స్పందించారు.. బతికించారు

  • కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు గొడవపడ్డారు. కోపంతో బయటకు వెళ్లిన భర్త జీవితం చాలించాలనే నిర్ణయానికి వచ్చాడు. రైల్వేపట్టాల దగ్గరకు వెళ్లి డయల్‌ 100కు ఫోన్‌చేసి తన మృతదేహాన్ని తీసుకెళ్లమంటూ చెప్పి మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. వెంటనే రాచకొండ పరిధిలోని భువనగిరి పట్టణ పోలీసులు అప్రమత్తమయ్యారు. కానిస్టేబుల్‌ బి.రామారావు, హోంగార్డు(డ్రైవర్‌) ఎన్‌.శ్రీనివాస్‌ ఫోన్‌ నెంబరు ట్రాక్‌ చేస్తూ పట్టాలమీద నిలబడిన బాధితుడిని కాపాడారు.
  • కూకట్‌పల్లిలో ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఉరేసుకునేందుకు సిద్ధమయ్యాడు. స్నేహితులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన మిత్రులు వెంటనే డయల్‌ 100కు వివరాలు తెలియజేశారు. వెంటనే పోలీసులు యువకుడు ఉంటున్న గది వద్దకెళ్లారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న అతనిని సకాలంలో కిందకు దించి ప్రాణాలు నిలిపారు.
  • ఎల్బీనగర్‌లో సృహలేకుండా పడిఉన్న వృద్ధురాలను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి.. ఆశ్రమంలో చేర్పించారు. యాదగిరిగుట్ట వద్ద మూడుకార్లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన బాధితులను.. క్రేన్‌సాయంతో బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు. బాటసింగారం వద్ద ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన యువకులకు ప్రథమచికిత్స అందించి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు.

జనవరి-నవంబరు వరకూ ఫోన్‌కాల్స్‌

సైబరాబాద్‌ రాచకొండ
రహదారి ప్రమాదాలు 12,816 2,243
తగాదాలు, చోరీలు 27,758 11,284
ఆలుమగల తగాదాలు 29,412 26,924
తీవ్రంగా కొట్టడం 36,412 60,000
ఇతర అంశాలు 63,651 57,255
మొత్తం 1,70,1001,57,706
  • సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ సగటు సమయం- 5 నిమిషాల 30 సెకన్లు
  • రాచకొండ పోలీసు కమిషనరేట్‌ సగటు సమయం- 6.1 నిమిషాలు, అర్బన్‌- 5 నిమిషాలు, రూరల్‌ ప్రాంతాలు- 9 నిమిషాలు.

పెళ్లిరోజు, పుట్టినరోజులు, పండుగలు, శుభకార్యాలకు వెళ్లేందుకు సిద్ధమైన పోలీసు అధికారులు, సిబ్బంది కూడా అత్యవసరమైన సేవల్లో పాల్గొనేందుకు తిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయంటున్నారు పోలీసులు.

రోజూ పర్యవేక్షణ ఉంటుంది

శాంతిభద్రతల నిర్వహణలో కీలకమైన డయల్‌ 100 సేవల్లో.. క్షేత్రస్థాయిలో హోంగార్డు నుంచి పోలీసు కమిషనర్‌ వరకూ నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రతిరోజూ వస్తున్న ఫోన్‌కాల్స్‌.. పోలీసులు చేరుతున్న సమయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మెరుగైన సేవలు అందించటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

- ఎం.స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

ప్రాణాలు కాపాడుతున్నారు

డయల్‌ 100కు ఫోన్‌ వచ్చిన సమయం నుంచి.. బాధితుల వద్దకు చేరేంత వరకూ అన్ని స్థాయిలో సమన్వయం ఉంటుంది. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాంలో ఆసుపత్రికి తరలిస్తున్నాం. ఇంటి నుంచి మాయమైన పిల్లలను వెంటనే వెతికి కన్నవారికి అప్పగిస్తున్నామంటే సిబ్బంది వేగంగా స్పందించటమే కారణం. 20-30 మంది వరకూ ఆత్మహత్య చేసుకోబోతున్న వారిని కాపాడారు.

- మహేశ్‌భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్‌

గతంలో ఆకతాయిలు డయల్‌ 100కు ఫోన్‌చేసి ఆటపట్టించేవారు. అత్యవసర సేవలను దుర్వినియోగం చేసేవారు. ఇటువంటివారిని గుర్తించటం ఒక సవాల్‌ అయితే.. నకిలీ కాల్స్‌తో విలువైన సమయం కోల్పోతున్నామనే ఆందోళన పోలీసుల్లో కనిపించేది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రతి ఫోన్‌కాల్‌ గుర్తిస్తున్నారు. దీంతో చాలా వరకూ నకిలీ కాల్స్‌ తగ్గాయి అంటున్నారు పోలీసు అధికారులు.

ఇదీ చూడండి: 'ఆపదలో ఉంటే 100కు డయల్ చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.