ETV Bharat / state

CS on Fever Survey: వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తిచేస్తాం: సీఎస్‌

author img

By

Published : Jan 21, 2022, 3:36 PM IST

Updated : Jan 21, 2022, 6:11 PM IST

CS on Fever Survey: వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తిచేస్తామని సీఎస్‌ సోమేశ్​కుమార్​ వెల్లడించారు. కొవిడ్‌ లక్షణాలుంటే 5 రోజుల మందుల కిట్‌ అందజేస్తామన్నారు. కోటి మందుల కిట్‌లు సిద్ధంగా ఉంచామని సీఎస్​ స్పష్టం చేశారు. ఖైరతాబాద్​లో జరుగుతున్న ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. మరోవైపు బంజారాహిల్స్ ఎన్​బీటీనగర్​లో ఫీవర్ సర్వేను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు.

CS on Fever Survey: వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తిచేస్తాం: సీఎస్‌
CS on Fever Survey: వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తిచేస్తాం: సీఎస్‌

CS on Fever Survey: రాష్ట్రంలో ఫీవర్ సర్వే వారం రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ -19 మూడో విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్లు సీఎస్​ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్​లోని హిల్​టాప్ కాలనీలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్​, తదితర అధికారులు ఆయనతో పాటు పరిశీలించారు. కరోనా మూడో వేవ్​తో గానీ, ఒమిక్రాన్​తో గానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎస్ అన్నారు. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్​లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లోగా పూర్తి చేసే ఈ ఇంటింటి ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కొక్క టీమ్​లో ఆశా, ఏ.ఎన్.ఎం, మున్సిపల్, పంచాయతీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కొవిడ్ లక్షణాలు ఉంటే మెడికల్ కిట్​ను అందజేస్తారని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటుతో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయవంతంగా ప్రారంభమైందని సీఎస్​ అన్నారు.

ఒక వారం రోజుల్లో ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం. దీనివల్ల వ్యాక్సినేషన్​ గురించి కూడా వివరాలు సేకరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ ఫీవర్​ సర్వేకు సహకరించాలి. కొవిడ్‌ లక్షణాలుంటే 5 రోజుల మందుల కిట్‌ అందజేస్తాం. కోటి మందుల కిట్‌లు సిద్ధంగా ఉంచాం. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నాం. -సోమేశ్​కుమార్​, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

CS on Fever Survey: వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తిచేస్తాం: సీఎస్‌

ఫీవర్​ సర్వేను పరిశీలించిన మేయర్​

హైదరాబాద్ బంజారాహిల్స్ ఎన్​బీటీనగర్​లో ఫీవర్ సర్వేను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఫీవర్ సర్వేను అన్ని శాఖల అధికారులు కలిసి విజయవంతం చేయాలని మేయర్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్​లు అందిస్తున్నామని చెప్పారు. కరోనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ల్యాబ్​లలో 500 రూపాయలు మాత్రమే తీసుకోవాలని.. ఎక్కువగా తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 60 ఏళ్ల పై పడిన వారందరూ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని.. అలాగే వ్యాక్సినేషన్ రెండో డోస్ తీసుకోని వారందరూ తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు.

ఫీవర్​ సర్వేను పరిశీలించిన మేయర్​
ఫీవర్​ సర్వేను పరిశీలించిన మేయర్​

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 21, 2022, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.