ETV Bharat / state

Crop Damage: అరిగోస.. వానలు ఆగవాయే.. పరిహారం రాదాయే

author img

By

Published : May 5, 2023, 8:12 AM IST

Updated : May 5, 2023, 8:20 AM IST

Crop Damage
Crop Damage

Crop Damage in Telangana : రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలంటూ అన్నదాతలు, రైతు సంఘాలు పోరుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీ ప్రకారం.. రూ.10 వేల సాయం అందకపోగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సాయం అందించకపోతే ప్రగతిభవన్‌, సచివాలయం ముట్టడి చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సమాయత్తం అవుతున్నాయి.

రైతులను వెంటాడుతున్న అకాల వర్షాలు.. పరిహారం చెల్లించడంలో తీవ్రంగా జాప్యం

Crop Damage in Telangana : రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతకు తీరనినష్టం మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయా పంటల సాగు కోసం వేలాది రూపాయల పెట్టుబడి, శ్రమ వెచ్చించినా.. చేతికొచ్చే దశలో కురిసిన వడగండ్ల వానలు రైతు వెన్ను విరిచేశాయి. అయితే నష్టం అంచనాల రూపకల్పన నత్తనడక సాగుతుండటంతో పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. తద్వారా సాయం అందక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

అకాల వర్షాలు.. అతలాకుతలమైన రైతులు: హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతుస్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రైతులు, ప్రజా సంఘాలు రౌండ్‌టేబుల్‌ భేటీ నిర్వహించాయి. ఆ సమావేశంలో రైతులు ఆవేదనను తమ ఆవేదనను ఏకరవు పెట్టారు. మార్చిలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఇంకా అంచనాలే పూర్తికాలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సాయం అందకముందే మళ్లీ జోరుగా కురిసిన వర్షాలకు రైతులు అతలాకుతలమై పోయారు.

' కౌలు రైతులతో సహా పంట నష్టపోయిన రైతులందరికీ విపత్తు సాయం అందించాలి. కొనుగోలు కేంద్రాలు వరద తాకిడిని తట్టుకునే విధంగా రూపొందించాలి. వాటిని శాశ్వతంగా ఉండేలా నిర్మించాలి. పంట బీమా పథకం సరిగ్గా లేదు. కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలంటే 2011 చట్టం ప్రకారం.. వారికి తక్షణమే సర్టిఫికేట్​లు ఇవ్వాలి'. -ప్రొఫెసర్ కొదండరాం

Struggle For Crop Compensation: కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని.. ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం నాన్చివేత ధోరణిని పక్కనపెట్టి, తక్షణమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని రైతు సంఘాలు ప్రకటించాయి.

'కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తడిసిన ధాన్యన్ని మేము కొన్నాం. ఆ కొన్న ధాన్యాన్ని మర పట్టించి, బియ్యం.. నూకలను పౌల్ట్రీ ఫారమ్స్​కి సబ్సిడీ కింద ఇచ్చాం. మీరు కూడా ఆ పని చేయండి. ప్రభుత్వానికి కొంత నష్టం రావొచ్చు కానీ, ఆదుకోవాల్సిన అవసరం ఉంది'. -కోదండరెడ్డి, ఉపాధ్యక్షుడు, జాతీయ కాంగ్రెస్ కిసాన్ కమిటీ

ఇవీ చదవండి:

Last Updated :May 5, 2023, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.