ETV Bharat / state

Ktr France tour: రాష్ట్రంలో పెట్టుబడులకు కాస్మొటిక్‌ వ్యాలీ సంస్థల ఆసక్తి: కేటీఆర్

author img

By

Published : Oct 29, 2021, 4:48 AM IST

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కాస్మొటిక్‌ వ్యాలీ సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఫ్రాన్స్​లో పర్యటిస్తున్న మంత్రి ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. భారత్‌లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండ్‌ ఉందని.. మార్కెటింగ్‌లో ఏటా భారీ వృద్ధి రేటు సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. కరోనా సమయంలోనూ సౌందర్య సాధనాల విక్రయాలు తగ్గలేదన్నారు.

Cosmetic‌ Valley companies
కాస్మొటిక్‌ వ్యాలీ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెరోకు జ్ఞాపిక బహూకరిస్తున్న మంత్రి కేటీఆర్‌, పక్కన జయేశ్‌రంజన్‌

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఫ్రాన్స్‌లోని ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ప్రసిద్ధి చెందిన కాస్మొటిక్‌ వ్యాలీ డిప్యూటీ సీఈవో, అంతర్జాతీయ వ్యూహకర్త ఫ్రాంకీ బెచెరో నేతృత్వంలో పలు సంస్థల అధిపతులు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ విషయమై చర్చించారు. ‘‘పారిస్‌లోని కాస్మొటిక్‌ వ్యాలీలో 800 కంపెనీలున్నాయి. ఏటా రూ.82 వేల కోట్ల మేరకు ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఆయా సంస్థల్లో 70,000 మంది పనిచేస్తున్నారు. 7 విశ్వవిద్యాలయాలు, 136 కళాశాలలు, 200 పరిశోధన ప్రయోగశాలలు అనుబంధంగా ఉన్నాయి. 100 పరిశోధన ప్రాజెక్టులు నడుస్తుండగా.. 8,600 పరిశోధకులు నిత్యం ప్రయోగాలు చేస్తున్నారు’’ అని ఫ్రాంకీ, పారిశ్రామికవేత్తలు తెలిపారు. భారత్‌లో సౌందర్య సాధనాలకు భారీగా డిమాండ్‌ ఉందని, మార్కెటింగ్‌లో ఏటా భారీ వృద్ధి రేటు సాధిస్తోందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కరోనా సమయంలోనూ సౌందర్య సాధనాల విక్రయాలు తగ్గలేదన్నారు. తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశమంతటా మార్కెటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. త్వరలో తెలంగాణను సందర్శించాలని మంత్రి కోరగా పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఫ్రాంకీని కేటీఆర్‌ పోచంపల్లి శాలువతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

క్షిపణుల తయారీకి సిద్ధం

వైమానిక, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా ఉందని, క్షిపణుల తయారీ పరిశ్రమలకు సిద్ధంగా ఉందని కేటీఆర్‌ చెప్పారు. పారిస్‌లోని ప్రసిద్ధ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీడీఏ డైరెక్టర్లు బోరిస్‌ సాలోమియాక్‌, పోల్‌నీల్‌ లివిక్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు జీన్‌ మార్క్‌ పేరాడ్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, డిజిటల్‌ మీడియా సంచాలకుడు కొణతం దిలీప్‌, వైమానిక సంచాలకుడు ప్రవీణ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోని ప్రసిద్ధ వైమానిక సంస్థలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపించి.. విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాలను తయారు చేస్తున్నాయని వివరించారు. క్షిపణుల తయారీకి సన్నద్ధమవుతున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శించాలన్నారు. అనంతరం ప్రసిద్ధ వైమానిక సంస్థ ఏరోక్యాంపస్‌ అక్విటైన్‌ డైరెక్టర్‌ జేవియర్‌ ఆడియన్‌తోనూ కేటీఆర్‌ సమావేశమయ్యారు. భారత రాయబార కార్యాలయ వైమానిక విభాగ అధికారి హిలాల్‌ అహ్మద్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు.

* ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావేద్‌ అష్రఫ్‌తో కేటీఆర్‌ అధికారికంగా సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలు, సంస్థలతో భేటీల గురించి తెలిపారు. పెట్టుబడుల సమీకరణకు సహకరించాలని కోరారు. అంతకుముందు భారత రాయబార కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ కేటీఆర్‌, ఫ్రాన్స్‌ డిజిటల్‌ వ్యవహారాల రాయబారి హెన్నీ వెర్డియర్‌ల భేటీని ప్రముఖంగా పేర్కొంది.

ఇదీ చూడండి:

KTR France Tour: ఫ్రాన్స్​లో కేటీఆర్​.. కీలక కంపెనీల సీఈవోలతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.