ETV Bharat / state

చాపకింద నీరులా కరోనా... ఈ మహమ్మారి ఆగేనా?

author img

By

Published : Apr 21, 2020, 11:57 AM IST

ముందు నెగిటివ్... తరువాత పాజిటివ్... కొన్ని సార్లు అయితే అసలు లక్షణాలు సైతం లేకుండా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరికి ఒకసారికన్నా ఎక్కువసార్లు పరీక్షలు చేయాల్సి వస్తోంది. హైదరాబాద్​ పరిధిలో మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ... ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు సైతం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటైన్​మెంట్ ఏరియాలో మరింత పటిష్ఠంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

corona outbreak in Hyderabad
చాపకింద నీరులా కరోనా... విస్తరిస్తూనే ఉంది ఆగేనా?

కేపీహెచ్​బీ పరిధి మూడోఫేజ్‌లో ఎంఐజీ నివాసాల్లోని ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకిన నేపథ్యంలో అధికారులు ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా మార్చారు. కరోనా సోకిన యువకుడి నివాసాన్ని మేడ్చల్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వీరాంజనేయులు సోమవారం పరిశీలించారు. ఆ శాఖ సిబ్బంది 21 బృందాలుగా 1,975 ఇళ్లలో సర్వే నిర్వహించి దగ్గు, జలుబు, జ్వరంతో ఎవరైనా బాధపడుతున్నారా అని ఆరా తీశారు. యువకుడికి తాగునీరు సరఫరా చేసిన ఇద్దరిని, మందుల దుకాణానికి సంబంధించి ఒకరిని, ఇంటి కాపలాదారుణ్ని పరీక్షల నిమిత్తం ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి తరలించారు.

నేరేడ్‌మెట్‌లో ఇద్దరికి..

నేరేడ్‌మెట్‌లో ఈనెల 17న కరోనాతో చికిత్స పొందుతున్న వృద్ధుడి భార్య, మనవరాలికి సైతం కరోనా నిర్ధారణ అయింది. వీరితో పాటు మరో 25 మందిని సైతం క్వారంటైన్‌కు తరలించగా పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

ఛాతీ ఆసుపత్రిలో 14 మందికి చికిత్సలు

కొవిడ్‌-19 నిర్ధారణతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో 14 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని... వీరందరి పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. వీరితోపాటు మరో 46 మంది అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్న నలుగురిని డిశ్చార్జి చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం తొమ్మిది మంది నల్లకుంట ఫీవరాసుపత్రిలో చేరారు.

ఐటీ ఉద్యోగి మృతి.. శాంపిళ్ల సేకరణ

మణికొండకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఐటీ ఉద్యోగి వర్క్‌ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహించారు. చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. గత శనివారం రాత్రి శ్వాస సమస్య వచ్చిన నేపథ్యంలో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించగా మెరుగైన చికిత్స కోసం మరుసటి రోజు గచ్చిబౌలిలోని ఓ కార్పొరేటు ఆస్పత్రికి తరలించగా, కొద్దిసేపటికే మరణించారు. తీవ్రమైన మధుమేహంతో చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. శ్వాస సమస్యలు ఉన్న కారణంగా కరోనా పరీక్షల కోసం శాంపిళ్లు సేకరించారు. నేడు ఈ ఫలితాలు రానున్నట్లు అధికారులు తెలిపారు.

కంటైన్‌మెంట్‌గా ఆదర్శనగర్‌

తుర్కయాంజాల్‌ పురపాలికలోని మునగనూర్‌ ఆదర్శనగర్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ ఓ వ్యక్తికి కరోనా సోకిన విషయం విదితమే. అతని భార్య, ఇద్దరు పిల్లలతో పాటు ఆ కుటుంబంతో కలివిడిగా ఉన్న మరో 10 మంది స్థానికులను రావిర్యాలలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో..

వనస్థలిపురం డివిజన్‌లోని ఓ కాలనీలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ఉదయం ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జెడ్పీ ఉపేందర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ జయరాంతో కలిసి సందర్శించి ఆ పాంత్రాన్ని కంటైన్‌మెంట్‌గా ప్రకటించారు. ఇక్కడ కాపలాదారుగా పనిచేసే అసోంకు చెందిన వ్యక్తి గత నెల రైలులో నగరానికి వచ్చాడు. ఈనెల 19న కాలనీలో సర్వే చేస్తుండగా విషయం బయటపడింది. నమూనాలు సేకరించగా పాజిటివ్‌ అని తేలింది. మొత్తం 19 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

చంపాపేట డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బ్యాంకులో పనిచేసే ఆ వ్యక్తి తనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గ్రహించి వైద్యాధికారులను సంప్రదించాడు. ఈమేరకు నాలుగు రోజుల క్రితం నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. సోమవారం పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో... అతనితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులను రామంతాపూర్‌లోని హోమియో ఆసుపత్రి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

ముందు నెగిటివ్‌.. తర్వాత పాజిటివ్‌

ముషీరాబాద్‌ డివిజన్‌లో 55 ఏళ్ల మహిళ కరోనా బారిన పడింది. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులను ఇటీవల కార్వంటైన్‌కు తరలించారు. ఆ మహిళ కుమారుడికి మొదట పరీక్షల్లో నెగిటివ్‌గా తేలగా ఇంటికి పంపారు. మళ్లీ పరిక్షించగా... ఫలితాల్లో కొవిడ్‌-19 ఉన్నట్లు తేలింది. వెంటనే అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదే కుటుంబానికి చెందిన మరో మహిళకు సైతం కరోనా ఉన్నట్లు తేలింది.

ఆ ఐదుగురిలో కరోనా లక్షణాల్లేవు

ఈనెల 17న ఖైరతాబాద్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన ఎనిమిది మందిలో ముగ్గురికి కరోనా ఉన్నట్లు గుర్తించగా... మిగతా ఐదుగురికీ ఆ లక్షణాలు లేనట్లు తేలింది. దాంతో వారిని ఇంటికి పంపారు. ఆదివారం వివిధ ఆస్పత్రులకు తరలించిన 31 మందిలోనూ పది మందికి కరోనా లక్షణాలు లేకపోవడంతో వారినీ ఇళ్లకు పంపారు. మిగతా 21 మందికి చెందిన రిపోర్టులు రావాల్సి ఉంది.

నమూనాల సేకరణకు క్యాబిన్‌ వితరణ

కరోనా అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సురక్ష క్యాబిన్‌ను వైద్యదంపతులు పద్మమాలిని, కోటేశ్వర్‌రావులు గాంధీ ఆసుపత్రికి విరాళంగా అందజేశారు. ఈ క్యాబిన్‌లో రెండు రంధ్రాల్లో చేతి గ్లౌజ్‌లు ఉంటాయి. అందులోకి అనుమానితులు వెళ్లగానే నమూనాలను సేకరించే టెక్నీషియన్లు ఆ గ్లౌజ్‌ల్లో తమ చేతులు తొడిగి సురక్షితంగా అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తారు. దీన్ని స్వీకరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌, వైరాలజీ ల్యాబ్‌ నిర్వాహకురాలు జ్యోతిలక్ష్మీ మాట్లాడుతూ.. నమూనాలు సేకరించే క్రమంలో సిబ్బందికి ఎంతో రక్షణగా, ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

వారిని సైతం...

నగరంలో యాచకులను సమీపంలోని నిరాశ్రయుల సహాయ కేంద్రాలకు తరలిస్తున్నామని జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్ కుమార్ తెలిపారు. ఖైరతాబాద్‌ కూడలి నుంచి 22 మందిని విక్టరీ క్రీడా మైదానంలోని కేంద్రానికి పంపించామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో చర్యలు ఆరంభించామని అన్నారు. యాచకులు కొవిడ్‌ బారిన పడకుండా ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

ఇవీ చూడండి: సిద్ధిస్తున్న స్వప్నం.. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.