ETV Bharat / state

కరోనా పంజా : తిరగని బతుకు చక్రం

author img

By

Published : Mar 21, 2020, 9:14 AM IST

Updated : Mar 21, 2020, 11:09 AM IST

కాదేదీ కరోనాకు అనర్హం అన్నట్లు.. అన్ని రంగాలపైనా కొవిడ్​ తన పంజా విసురుతోంది. కరోనా వ్యాప్తి తగ్గించేందుకు ఇంట్లోనే స్వీయ నిర్బంధం కావాలన్న ప్రజాప్రతినిధుల పిలుపు మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు విమాన సర్వీసులు, ప్రత్యేక రైళ్లు రద్దు చేశారు. దీని ప్రభావం ప్రైవేటు రవాణా రంగంపై పడి డ్రైవర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

corona effect on telangana private transport
కరోనా పంజా : తిరగని బతుకు చక్రం

కరోనా పంజా : తిరగని బతుకు చక్రం

కరోనా కారణంగా విమాన సర్వీసులు, ప్రత్యేక రైళ్ల రద్దు ప్రభావం ప్రైవేటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు వారాలుగా గిరాకీ లేక డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. బుకింగ్‌లు, ఆదాయం సగానికి సగం పడిపోవడం వల్ల ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే దాదాపు లక్ష మందిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

వాహన రుణ వాయిదా, ఇంటి అద్దె చెల్లింపులతో పాటు కుటుంబ పోషణ వారికి భారమవుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం గరిష్ఠంగా 15-20 బుకింగ్‌లు ఉంటే, ప్రస్తుతం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తిరిగినా ఏడెనిమిది కూడా దొరకడంలేదని చెబుతున్నారు.

రాష్ట్రంలో క్యాబ్‌లు, ఆటోలపై ఆధారపడి నాలుగు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. కరోనా దెబ్బతో సెలవులు, విమానాల రద్దు, ఐటీ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం తదితర కారణాల వల్ల ఆటోల్లో, క్యాబ్‌లకు గిరాకీ లేదు. వాటి డ్రైవర్ల ఆదాయం సగానికి పైగా తగ్గిపోయింది.

12 గంటలకు పైగా కష్టపడితే గతంలో రోజుకు రూ.1,000 మిగిలేది. ఇప్పుడు రూ.200 కూడా మిగలట్లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఈ చిన్న మొత్తంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్ధం కావడం లేదని, వాహనాలకు రుణాలు ఎలా చెల్లించాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆరే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రుణాలపై రెండు నెలల పాటు వడ్డీ లేకుండా, రెండు నెలల రుణ వాయిదాల్ని ఆఖరులో చెల్లించేలా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు వెసులుబాటు కల్పించాలని తెలంగాణ క్యాబ్‌ ప్రోగ్రెసివ్‌ యూనియన్‌ కార్యదర్శి రవిగౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

Last Updated : Mar 21, 2020, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.