ETV Bharat / state

అసోం ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్‌ చేయాలి: షబ్బీర్‌ అలీ

author img

By

Published : Feb 14, 2022, 1:03 AM IST

Updated : Feb 14, 2022, 2:30 AM IST

Complaints against Assam CM himanta biswa sarma:అసోం ముఖ్యమంత్రిని తక్షణమే బర్తరఫ్ చేసేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అసోం సీఎంపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో అసోం సీఎం దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ నాయకులు యత్నించగా.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Shabir Ali
Shabir Ali

Complaints against Assam CM: రాహుల్‌ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ ఖండించినట్లు పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్ అలీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మని తక్షణమే బర్తరఫ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసోం ముఖ్యమంత్రిపై నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయనున్నట్లు వివరించారు. కేసులు నమోదు చేయనట్లయితే... పోలిసు స్టేషన్ల ముందు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారన్నారు. మహిళా నేతలు ఈనెల 18న మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారన్నారు.

దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 31 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేశామని.. 50లక్షల వరకు సభ్యత్వ నమోదు చేస్తామని వివరించారు.

క్షమాపణ చెప్పాలి...

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అసోం సీఎం ఫొటోను గాంధీ భవన్‌లో యువజన కాంగ్రెస్‌ దగ్ధం చేసింది. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్‌ చేశారు.

సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇస్తున్నట్లు భాజపా ప్రగల్భాలు పలుకుతోందని శివసేనరెడ్డి విమర్శించారు. రాహుల్‌ గాంధీ కుటుంబాన్ని కించపరిచేట్లు మాట్లాడటమేనా సంస్కృతి అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకుని అసోం ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వాగ్వివాదం, తోపులాట..

రాహుల్ గాంధీని కించపరిచినందుకు.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో అసోం సీఎం దిష్టిబొమ్మ దహనానికి కాంగ్రెస్ నాయకులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: రాహుల్​పై అనుచిత వ్యాఖ్యలను సమర్థించుకున్న సీఎం!

Last Updated : Feb 14, 2022, 2:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.