ETV Bharat / state

కత్తులు దూసిన కోళ్లు.. పందెంరాయుళ్లకు కాసులు

author img

By

Published : Jan 16, 2023, 7:43 AM IST

కోడిపందేలు
కోడిపందేలు

Kodi Pandelu in AP : ఆంధ్రప్రదేశ్​లో సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, డుడూ బసవన్న ఇవన్నీ ఒక ఎత్తైతే కోడిపందేలు మరో ఎత్తు. కోడిపందేలు లేకుండా పండుగ ముగియదంటే అతిశయోక్తి కాదు. పోలీసుల ఆంక్షలనూ లెక్కచేయకుండా నిర్వాహకులు రెచ్చిపోయారు. సంప్రదాయం మాటున కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి వదిలారు. వీటితోపాటు గుండాటలు, జూదం వెరసి పందెం రాయుళ్లకు కాసులు కురిపించాయి. పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ ఔత్సాహికులు తరలివచ్చారు.

జోరుగా కోడి పందేలు

Kodi Pandelu in AP : ఆంధ్రప్రదేశ్​లో కోడిపందేలకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా.. వాటిని పటాపంచలు చేస్తూ పుంజలను బరిలోకి దించారు నిర్వాహకులు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. కత్తికట్టకుండా, బెట్టింగ్ జరకుండా సంప్రదాయబద్ధంగా జరగాల్సిన పందేలు.. కోట్లు సంపాదించే అడ్డాగా మారిపోయాయి. పుంజలకు కత్తి కట్టి బరిలోకి వదలడంతో రక్తం చిందింది. కృష్ణా జిల్లా అంపాపురం, ఈడుపుగల్లులో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్ల కోసం వాహనాల పార్కింగ్, భోజనాలు, అత్యాధునిక వసతులతో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలివచ్చారు. భీమవరంలో జరిగిన కోడిపందేల్లో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అనుమతివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా : అధికార పార్టీ కనుసన్నల్లోనే కోళ్ల పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రోడ్డుపక్కనే బరులున్నా పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. బాపట్ల జిల్లా తీర ప్రాంతాల్లో విచ్ఛలవిడిగా పందేలు సాగుతున్నాయి. పెనుమూడిలో రోడ్డు పక్కనే బరులు ఉండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనసీమ జిల్లాలో గుండాటకు అనుమతివ్వకపోవడంతో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.. బెదిరించి మరీ రావులపాలెంలో గుండాట శిబిరాలను దగ్గరుండి ఏర్పాటు చేయించారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో గుండాటను పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు ధర్నాకు దిగారు. అనుమతివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ వైసీపీ నేత గుత్తుల వెంకటరమణ డీజిల్ బాటిల్‌తో బెదిరించారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పోలీసులతో మాట్లాడటంతో చివరకు అనుమతించారు.

అశ్లీల నృత్యాల ఏర్పాటు : ఉభయగోదావరి జిల్లాల్లో ఉదయాన్నే ప్రారంభమైన పందేలు రాత్రి పొద్దుపోయే వరకు ఉత్సాహంగా సాగాయి. రాత్రి సమయంలోనూ ఫ్లడ్‌లైట్ల వెలుగులో సై అంటే సై అని కోళ్లు కత్తి దూశాయి. గోదావరి జిల్లాల్లో రెండు రోజుల్లో సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడులో డాన్స్ బేబీ డాన్స్ పేరుతో వైసీపీ నాయకులు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. వైసీపీ నేతలు కూడా రెచ్చిపోయి డ్యాన్సులు చేసినా పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారని విమర్శలు వినిపించాయి.

పోలీసుల మెరుపు దాడులు : కొన్ని ప్రాంతాల్లో కోడిపందేల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో 10 మంది పందెం రాయుళ్లను అరెస్టు చేసి 16 బైక్‌లు, ఓ ఆటోతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చెన్నరాయునిపల్లిలో కోడిపందాలు ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా అంపాపురంలో11 మంది జూదగాళ్లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.